Parenting | మా పాప వయసు పద్దెనిమిది నెలలు. తనకు నీటితో నిండిన గుల్లలు వచ్చాయి. మూడు రోజుల నుంచి జ్వరం కూడా ఉంది. అమ్మవారు వచ్చిందని అనుకున్నాం. జ్వరం తగ్గింది. కానీ, పాప ఏమీ తినడం లేదు. మా బాబు వయసు ఆరు సంవత్సరాలు. పాపకంటే ముందుగా బాబులో ఈ లక్షణాలు కొద్దిగా కనిపించాయి. తను అంతగా ఇబ్బంది పడలేదు. ఇది చికెన్‌పాక్స్ లాంటి వ్యాధేనా? పాఠశాలలో పిల్లలందరికీ ఇది వస్తున్నది. ఆందోళనగా ఉంది. సలహా ఇవ్వండి.
– రేణుక, పద్మారావు నగర్, హైదరాబాద్
మీ బిడ్డకు జ్వరం వచ్చింది. కాళ్ల మీద చేతుల మీద గుల్లల్లాగా అయ్యాయంటున్నారు. అలాగే నాలుక మీద కూడా గుల్లలు వచ్చాయంటున్నారు. ఈ లక్షణాలను బట్టి దీనిని హ్యాండ్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అనిపిస్తుంది. వర్షాలు మొదలైన తర్వాత చాలామంది పిల్లలు ఈ వ్యాధి బారినపడ్డారు. చిన్నపిల్లల్లో దీని ప్రభావం ఎక్కువ. ఇది మీ బాబు ద్వారా పాపకు సోకి ఉండొచ్చు. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే చర్మం మీద ఉన్న రాషెస్కి లోషన్ రాయాలి. జ్వరం సిరప్ (శరీర బరువును బట్టి) ఇవ్వాలి. కాళ్లు, చేతులపై ఉన్నట్టు నోటిలో, ఇంకా లోపల కూడా గుల్లలు ఉంటాయి. వీటివల్ల అల్సర్ సమస్య ఉంటుంది. ఆహారం మింగలేరు. నోటి నుంచి లాలాజలం కారుతుంది.
జ్వరానికి సిరప్ ఇచ్చిన తర్వాత గొంతునొప్పి తక్కువగా ఉంటుంది. అప్పుడు ద్రవ ఆహారం ఇవ్వాలి. ఓఆర్ఎస్, కొబ్బరినీళ్లు, సగ్గుబియ్యం జావ తాగించాలి. ఇలా ఆరోగ్యకరమైన పానీయాలు ఇవ్వాలి. ఎక్కువ వేడి, బాగా చల్లగా ఉన్న ద్రవాలు ఇవ్వకూడదు. కొంతమంది పిల్లలు నీళ్లు తక్కువగా తాగుతారు. కాబట్టి డీ హైడ్రేషన్ బారినపడతారు. వీళ్లకు మూత్రం కూడా రాదు. ఇలాంటి స్థితిలో ఉంటే హాస్పిటల్లో చేర్చి, స్లైన్ ఎక్కించాలి. ఇప్పుడంత ప్రమాదకరంగా లేదు. కాబట్టి జ్వరానికి, నొప్పులకు మందులు ఇస్తే సరిపోతుంది. అంతగా ఆందోళన చెందాల్సిన పనిలేదు.
– డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్