Chia Seeds Oil For Hair | శిరోజాలు అందంగా ఉండాలని, కాంతివంతంగా కనిపించాలని ఎవరైనా కోరుకుంటారు. అందుకనే మార్కెట్లో లభించే రకరకాల సౌందర్య సాధన ఉత్పత్తులను ప్రయత్నిస్తుంటారు. అలాగే కొందరు జుట్టు సంరక్షణ, స్టైలింగ్ కోసం బ్యూటీ పార్లర్లకు సైతం వెళ్తుంటారు. అయితే చాలా మంది ప్రస్తుతం చుండ్రు, జుట్టు రాలడం, జుట్టు బలహీనంగా మారి చిట్లిపోవడం వంటి జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. కాలుష్యం, ఒత్తిడి, పోషకాహార లోపం, థైరాయిడ్ వంటి సమస్యలు ఉండడం వంటి కారణాల వల్ల ఆయా జుట్టు సమస్యలు చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి బయట పడాలంటే అందుకు ఖరీదైన చికిత్సలు తీసుకోవాల్సిన పనిలేదు. కేవలం మనకు అందుబాటులో ఉండే ఈ నూనెను ఉపయోగిస్తే చాలు, జుట్టు సమస్యలు సులభంగా తగ్గిపోతాయి.
మీరు చియా సీడ్స్ గురించి వినే ఉంటారు. వీటిని చాలా మంది నీటిలో నానబెట్టి రోజూ తింటుంటారు. కొందరు తియ్యని వంటకాల్లోనూ వేస్తుంటారు. చియా సీడ్స్‌తో చల్లని పానీయాలను తయారు చేసి కూడా తాగవచ్చు. అయితే మనకు చియా సీడ్స్‌కు చెందిన నూనె కూడా లభిస్తుంది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా జుట్టు సంరక్షణకు ఈ నూనె ఎంతగానో దోహదపడుతుంది. దీన్ని పలు రకాలుగా ఉపయోగించడం వల్ల జుట్టు సమస్యల నుంచి బయట పడవచ్చు. చియా సీడ్స్ ఆయిల్ ను జుట్టుకు రాయడం వల్ల జుట్టు కుదుళ్ల నుంచి బలంగా మారుతుంది. జుట్టుకు కావల్సిన తేమ లభిస్తుంది. దీంతో శిరోజాలు కాంతివంతంగా మారుతాయి.
చియా సీడ్స్ ఆయిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి శిరోజాలకు రక్త సరఫరా సరిగ్గా జరిగేలా చూస్తాయి. దీంతో జుట్టుకు కావల్సిన పోషణ లభిస్తుంది. జుట్టు రాలడం తగ్గి శిరోజాలు పొడవుగా పెరిగి ఒత్తుగా మారుతాయి. కాంతివంతంగా తయారవుతాయి. చియా సీడ్స్ ఆయిల్‌ను జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు సాగే గుణం పెరుగుతుంది. దీంతో జుట్టు చిట్లకుండా ఉంటుంది. ఈ ఆయల్లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో చుండ్రు, దురద నుంచి ఉపశమనం లభిస్తుంది.
చియా సీడ్స్ ఆయిల్‌ను ఉపయోగిస్తే జుట్టుకు సహజసిద్ధంగా కాంతి లభించి శిరోజాలు మెరుస్తాయి. ఇక ఈ ఆయిల్‌ను నేరుగా జుట్టుకు రాయకూడదు. మీరు తరచూ ఉపయోగించే ఏదైనా హెయిర్ ఆయిల్లో లేదా పెప్పర్మింట్, రోజ్మేరీ వంటి నూనెల్లో కలిపి ఈ నూనెను జుట్టుకు రాయాలి. 30 నుంచి 60 నిమిషాల పాటు వేచి ఉండాలి. తరువాత తలస్నానం చేయాలి. అలాగే చియా సీడ్స్ ఆయిల్లో తేనె, పెరుగు కలిపి జుట్టుకు పట్టించి కాసేపు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే జుట్టు రిపేర్ అవుతుంది. జుట్టు మృదువుగా మారి కాంతివంతంగా ఉంటుంది. ఇలా చియా సీడ్స్ ఆయిల్‌ను జుట్టుకు పలు విధాలుగా ఉపయోగించవచ్చు. దీంతో జుట్టు సమస్యలు అన్నింటి నుంచి బయట పడవచ్చు. శిరోజాలు ఒత్తుగా పెరిగి దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.