Quinoa | ప్రస్తుతం చాలా మందికి తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. ఆరోగ్యంగా ఉండడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాయామం చేయడంతోపాటు పౌష్టికాహారాన్ని తీసుకునేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అనేక రకాల పౌష్టికాహారాలు మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిల్లో కొన్ని ఆహారాలు మాత్రం సూపర్ ఫుడ్‌గా పేరుగాంచాయి. సరిగ్గా కినోవా కూడా అదే కోవకు చెందుతుంది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా సూపర్‌ఫుడ్‌గా పిలుస్తున్నారు. సెలబ్రిటీలు చాలా మంది కినోవాను రోజూ తింటుంటారు. దీన్ని తింటే అనేక పోషకాలు లభిస్తాయి. ఇవి మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వ్యాధులను నయం చేసుకునేందుకు సహాయం చేస్తాయి. కినోవాను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు, పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
కినోవాలో వృక్ష సంబంధ ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. మన శరీరానికి కావల్సిన 9 రకాల అమైనో ఆమ్లాలు కినోవాలో ఉంటాయి. నాన్‌వెజ్ తినని వారికి కినోవా ఉత్తమ ఆహారంగా చెప్పవచ్చు. దీన్ని తింటే ప్రోటీన్లను సమృద్ధిగా పొందవచ్చు. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. కండరాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. నాన్‌వెజ్ అధికంగా తినేవారు కూడా కినోవాకు మారితే ప్రోటీన్లను అధికంగా పొందవచ్చు. పైగా మాంసం అధికంగా తింటే దుష్పరిణామాలు కలుగుతాయి కనుక దానికి బదులుగా కినోవాను ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇక దీన్ని తింటే ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకం తగ్గేలా చేస్తుంది. కినోవాలో ఉండే ప్రోటీన్లు, ఫైబర్ కారణంగా దీన్ని తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది.
డయాబెటిస్ ఉన్నవారికి కినోవా ఎంతో మేలు చేస్తుంది. కినోవాలో ఫైబర్ అధికంగా ఉంటుంది. పైగా దీని గ్లైసీమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కనుక కినోవాను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. షుగర్ ఉన్నవారు రోజూ దీన్ని తింటుంటే ఎంతో ఫలితం ఉంటుంది. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. కినోవాలో అనేక రకాల మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇందులో మాంగనీస్ అధికంగా ఉంటుంది. ఇది మెటబాలిజంను పెంచుతుంది. దీని వల్ల క్యాలరీలు ఖర్చయి కొవ్వు కరుగుతుంది. కినోవాలో ఉండే మెగ్నిషియం వల్ల కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. నాడీ మండల వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. షుగర్, బీపీ నియంత్రణలో ఉంటాయి. ఇందులో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది. రక్తం తయారయ్యేలా చేస్తుంది.
కినోవాలో ఉండే ఫోలేట్ గర్భిణీలకు మేలు చేస్తుంది. కినోవాలో క్వర్సెటిన్, కాంప్ఫెరాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. గ్లూటెన్ వల్ల కొందరికి అలర్జీ ఉంటుంది. కానీ కినోవాలో గ్లూటెన్ ఉండదు. కనుక గ్లూటెన్ అలర్జీలు ఉన్నవారు కూడా కినోవాను ఎలాంటి భయం లేకుండా తినవచ్చు. ఇక కినోవాను ఎలా వండుకోవాలి.. అని చాలా మందికి సందేహం ఉంటుంది. కినోవాను నేరుగా ఉప్మా మాదిరిగా లేదా అన్నం లాగా వండుకుని తినవచ్చు. కినోవాను ముందుగా నీటిలో 1 లేదా 2 గంటలపాటు నానబెడితే చక్కగా ఉడుకుతుంది. కినోవాను వండే ముందు శుభ్రంగా కడగాలి. ఒక భాగం కినోవాకు గాను రెండు భాగాల నీళ్లను ఉపయోగించాలి. కినోవాను సైడ్ డిష్‌గా లేదా ప్రధాన ఆహారంగా తినవచ్చు. దీన్ని సలాడ్స్తోపాటు కలిపి కూడా తినవచ్చు. ఉదయం లేదా మధ్యాహ్నం కినోవాను తినాలి. ఇలా కినోవాను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు.