Curd | భోజనం చివర్లో చాలా మందికి పెరుగు తినే అలవాటు ఉంటుంది. పెరుగుతో భోజనం చేయకపోతే ఆహారం తిన్న ఫీలింగ్ కలగదు. ఇక కొందరు పెరుగు లేకపోతే కనీసం మజ్జిగతో అయినా సర్దిపెట్టుకుంటారు. అయితే పెరుగును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. దీంతో అజీర్తి, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. పెరుగును తింటే క్యాల్షియం, విటమిన్ డి, విటమిన్ బి12 సమృద్ధిగా లభిస్తాయి. ఇవి ఎముకలను, నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇలా పెరుగు లేదా మజ్జిగ వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. అయితే చలికాలం రాత్రిపూట పెరుగును తినాలా.. వద్దా.. అని చాలా మంది సందేహిస్తుంటారు. ఇందుకు ఆయుర్వేద వైద్యులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రి పూట మన శరీర మెటబాలిజం తక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో జీర్ణ సమస్యలు ఉన్నవారు పెరుగును తింటే సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. పెరుగులో కొవ్వులు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి జీర్ణం అయ్యేందుకు సమయం పడుతుంది. కనుక జీర్ణ సమస్యలు ఉన్నవారు రాత్రి పూట పెరుగు తింటే సమస్యలు ఇంకా ఎక్కువవుతాయి. కాబట్టి జీర్ణ సమస్యలు ఉన్నవారు రాత్రి పూట పెరుగును అసలు తినకూడదు. ఇక పెరుగు మన ఒంటికి చలువ చేస్తుంది. దీన్ని తింటే శరీరంలో మ్యూకస్ పెరుగుతుంది. అయితే దగ్గు, జలుబు, ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలు ఉన్నవారు లేదా తరచూ ఈ సమస్యల బారిన పడేవారు రాత్రి పూట.. అందులోనూ చలికాలంలో రాత్రి పూట పెరుగును తింటే మ్యూకస్ ఇంకా ఎక్కువై సమస్యలు మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక వీరు ఈ సీజన్లో రాత్రిపూట పెరుగును తినకపోవడమే మంచిది.
పెరుగును ఉదయం లేదా మధ్యాహ్నం తినవచ్చు. ఈ సమయంలో తింటేనే పెరుగు సులభంగా జీర్ణమవుతుంది. అయితే శ్వాసకోశ సమస్యలు లేని వారు రాత్రి పూట పెరుగును తినవచ్చు. కానీ జీర్ణ సమస్యలు ఉంటే మాత్రం తినకూడదు. ఇక ఎలాంటి సమస్యలు లేని వారు ఎప్పుడైనా సరే పెరుగును తినవచ్చు. కానీ పెరుగులో కొవ్వు లేకుండా ఉంటే మంచిది. అధిక బరువు తగ్గాలని చూస్తున్నవారు గడ్డ పెరుగు తినరాదు. అందులో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. కొవ్వు తీసిన పాలతో తయారు చేసిన పెరుగును తినాలి. ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. బరువును నియంత్రణలో ఉంచుకోవాలని చూసే వారు కూడా కొవ్వు తీసిన పాలతో తయారు చేసిన పెరుగునే తినాలి. ఈ విధంగా పెరుగును తింటే బరువు నియంత్రణలో ఉంటుంది.
పెరుగును తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. కనుక మధ్యాహ్నం పూట దీన్ని తింటేనే మంచిది. అలాగే పెరుగును తింటే జీర్ణాశయంలోని మంచి బ్యాక్టీరియాకు మేలు జరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పెరుగులో క్యాల్షియం, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. కండరాల నిర్మాణానికి సహాయం చేస్తాయి. చర్మం ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. శిరోజాలను సంరక్షిస్తాయి. ఈ విధంగా పెరుగుతో అనేక విధాలుగా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.