Almond : పిల్లల నుంచి పెద్దల వరకు బాదాం పప్పును ఇష్టపడని వారు ఉండరు. సూపర్ ఫుడ్‌గా పిలువబడే ఈ బాదాంలో న్యూట్రియంట్స్, విటమిన్లు, ఫైబర్, మెగ్నీషియం, ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మంచి ఆరోగ్యానికి తోడ్పడుతాయి. అయితే ఈ బాదాంను ఎలా తినాలనే విషయంలో కొందరికి సందేహం ఉంటుంది. నానబెట్టుకుని తినాలా..? లేదంటే నేరుగా తినాలా..? అనే అనుమానాలు మెదులుతుంటాయి. మరి ఎలా తీసుకుంటే ప్రయోజనం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
బాదాంను క్రమం తప్పకుండా తినడంవల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఇన్సులిన్ స్థాయి అదుపులో ఉంటుంది. ఇవి గ్లూకోజ్‌ను శరీరం బాగా శోషించుకొనేలా చేస్తాయి. తద్వారా మధుమేహం అదుపులో ఉంటుంది. అయితే నానబెట్టిన బాదం తినొచ్చా..? అన్నది చాలా మందిలో ఉండే సందేహం. వాస్తవానికి కొందరు నానబెట్టిన బాదం తింటే. మరికొందరు నేరుగా తింటుంటారు.
కానీ నానబెట్టిన బాదాం పప్పులు తినడమే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకు మంచిదంటే బాదాం పప్పుల మీద ఉండే తొక్కలో టానిన్ అనే పదార్థం ఉంటుంది. అది మన శరీరం పోషకాలను గ్రహించకుండా చేస్తుంది. ఎప్పుడైతే మనం బాదాం పప్పులను నానబెడుతామో అప్పుడు ఆ తొక్క ఊడిపోతుంది.
అలా తొక్క తొలగిపోయిన బాదాం మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందులోనూ ముఖ్యంగా రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినడంవల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇలా క్రమం తప్పకుండా బాదాంను తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
ఇక బరువు తగ్గాలనుకునే వారికి కూడా బాదాం ఎంతగానో సాయపడుతుంది. ఎందుకంటే బాదాంలో ఉండే మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ సమయం పొట్టను నిండుగా ఉంచుతాయి. ఈ క్రమంలోనే ఆకలి తగ్గుతుంది. తద్వారా బరువు తగ్గొచ్చు. అదేవిధంగా బాదాంలో ఉండే పోషకాలు క్యాన్సర్ నివారణలో కూడా సాయపడతాయి.