Egg Yolk | నాన్ వెజ్ తినే అందరికీ కోడిగుడ్లు అంటే ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఆమాటకొస్తే కొందరు వెజిటేరియన్లు కూడా కేవలం గుడ్లను తినేందుకే ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే కోడిగుడ్లలో ఉండే పచ్చని సొనను తినేందుకు మాత్రం చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. పచ్చని సొనలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుందని, దీన్ని తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని చాలా మంది జంకుతుంటారు. కనుకనే కోడిగుడ్లను తినేటప్పుడు పచ్చసొన వేరు చేసి తింటారు. అయితే పోషకాహార నిపుణులు, పరిశోధకులు చెబుతున్న ప్రకారం కోడిగుడ్డు పచ్చనిసొన పట్ల చాలా మందికి ఉన్న నమ్మకాలు కేవలం అపోహలేనని అంటున్నారు. కోడిగుడ్డు పచ్చ సొనను నిర్భయంగా తినవచ్చని, ఇందులో భయపడాల్సిన పని లేదని చెబుతున్నారు.
కోడిగుడ్డు పచ్చనిసొన ఆరోగ్యకరమే అయినప్పటికీ కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం దీన్ని తినకూడదని వైద్యులు అంటున్నారు. గుండె జబ్బులు ఉన్నవారు, అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నవారు, అలర్జీలు ఉన్నవారు కోడిగుడ్డు పచ్చ సొనకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతున్న ప్రకారం ఆరోగ్యవంతంగా ఉన్నవ్యక్తులు రోజుకు 2 కోడిగుడ్లను పచ్చ సొనతో సహా తినవచ్చు. ఇతర వ్యక్తులు రోజుకు ఒక కోడిగుడ్డును మాత్రమే పచ్చసొనతో సహా తినవచ్చు. అంతకు మించి తినకూడదు. కోడిగుడ్డు పచ్చ సొనను చాలా మంది తినకుండా విడిచిపెడుతుంటారు. కానీ అలా వదిలేస్తే చాలా పోషకాలను కోల్పోవాల్సి వస్తుంది. మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు కేవలం తెల్ల సొనలో మాత్రమే కాదు, పచ్చసొనలో కూడా ఉంటాయి.
ఒక మీడియం సైజ్ కోడిగుడ్డును తింటే దాని పచ్చ సొన బరువు సుమారుగా 17 గ్రాముల వరకు ఉంటుంది. దీని ద్వారా మనకు 55 క్యాలరీల శక్తి లభిస్తుంది. ప్రోటీన్లు 2.7 గ్రాములు, కొవ్వులు 4.5 గ్రాములు, కొలెస్ట్రాల్ 184 మిల్లీగ్రాములు ఉంటుంది. ఒక వ్యక్తికి రోజుకు 300 మిల్లీగ్రాముల వరకు కొలెస్ట్రాల్ అవసరం అవుతుంది. కనుక ఒక కోడిగుడ్డును పచ్చని సొనతో సహా కలిపి పూర్తిగా తినవచ్చు. పచ్చసొనను విడిచిపెట్టాల్సిన పనిలేదు. ఇక ఇందులో అనేక విటమిన్లు కూడా ఉంటాయి. విటమిన్లు డి, బి12, ఎ, ఇ, కెలతోపాటు ఐరన్, సెలీనియం, ఫాస్ఫరస్, కోలిన్ లు సమృద్ధిగా ఉంటాయి. పచ్చసొనను తినకపోతే ఈ పోషకాలను కోల్పోతారు. కనుక పచ్చ సొనను కచ్చితంగా తినాల్సి ఉంటుంది.
కోడిగుడ్డులో ఉండే పచ్చ సొనను తినడం వల్ల కోలిన్ అధికంగా లభించి మెదడు పనితీరు మెరుగు పడుతుంది. ముఖ్యంగా చిన్నారుల మెదడు వికసిస్తుంది. వారు చదువుల్లో రాణిస్తారు. తెలివితేటలు పెరుగుతాయి. కోడిగుడ్డు పచ్చ సొనలో లుటీన్, జియాజాంతిన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ల జాబితాకు చెందుతాయి. ఇవి కళ్లను రక్షిస్తాయి. కంటి చూపు మెరుగు పడేలా చేస్తాయి. పచ్చ సొనలో విటమిన్ డి అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కోడిగుడ్డు పచ్చసొనలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వుల వల్ల ఆ సొనలోని విటమిన్లు ఎ, డి, ఇ, కె లను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. దీంతో పోషకాహార లోపం ఉండదు. ఈ సొనను తింటే ఐరన్ లభించి రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. ఇలా పలు జాగ్రత్తలను పాటిస్తూ కోడిగుడ్డులోని పచ్చసొనను తింటుంటే అనేక లాభాలను పొందవచ్చు.