Chapati | బయట మనం ఎన్ని ఆహార పదార్థాలను తిన్నా కానీ ఇంట్లో తయారు చేసి తినే ఆహారాల రుచే వేరుగా ఉంటుంది. ముఖ్యంగా పప్పుతో కలిపి అన్నం లేదా చపాతీలను తింటే వచ్చే రుచే వేరు. ఇలా చాలా మంది ఇంట్లో ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే కేవలం మన దేశంలోనే కాదు చాలా మంది ప్రపంచవ్యాప్తంగా గోధుమ పిండిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దాంతో పలు రకాల ఆహారాలను తయారు చేసి తింటుంటారు. అయితే గోధుమ పిండి మన ఆరోగ్యానికి మేలు చేసే మాట వాస్తవమే అయినా కొందరు అదే పనిగా గోధుమ పిండి లేదా గోధుమ రవ్వను ఉపయోగిస్తుంటారు. కానీ ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు గోధుమ పిండిని మరీ ఎక్కువగా తినకూడదు. తింటే షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం ఉంటుంది. దీంతోపాటు పలు ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే కొందరు గోధుమ పిండి లేదా రవ్వ ఆరోగ్యానికి హానికరం అని చెప్పి తినడం మానేస్తుంటారు. అయితే గోధుమలు నిజంగానే మనకు హాని చేస్తాయా, వీటిని తినకూడదా, ఇందుకు అసలు వైద్య నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారు.. తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమల్లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఫైబర్, ప్రోటీన్లు, బి విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. అందువల్ల గోధుమలను తింటే మనకు పోషణ లభిస్తుంది. అయితే వీటిని మరీ ఎక్కువగా తింటే బరువు అధికంగా పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక గోధుమలను చపాతీలు లేదా రవ్వ ఎలాగైనా సరే తక్కువ మోతాదులో తినాలని అంటున్నారు. అయితే బరువు పెరుగుతామేమోనని భయపడి కొందరు వీటిని తినడమే మానేస్తుంటారు. ఇలా కూడా చేయవద్దని వైద్యులు చెబుతున్నారు. చపాతీలు లేదా గోధుమ రవ్వను మోతాదులో తింటే ఆరోగ్యానికి ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు.
చపాతీలను లేదా గోధుమ రవ్వను మరీ అతిగా తినకూడదు. తింటే బరువు పెరిగిపోతారు. ఇక గోధుమల్లో ఆక్సలేట్స్ అధికంగా ఉంటాయి. కనుక కిడ్నీ సమస్యలు లేదా కిడ్నీ స్టోన్లు ఉన్నవారు చపాతీలను లేదా గోధుమ రవ్వను అతిగా తినకూడదు. వీరు అసలు గోధుమలను తినడం మానేస్తేనే మంచిది. లేదంటే కిడ్నీ స్టోన్ల సమస్య ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు తీవ్ర అనారోగ్యాల బారిన పడే ప్రమాదం కూడా ఉంటుంది. కనుక వీరు గోధుమలను అసలు తినకూడదు. ఇక గోధుమల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కనుక ఇవి జీర్ణం అయ్యేందుకు సమయం పడుతుంది. కనుక గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు ఉన్నవారు గోధుమలను తినకూడదు.
అయితే చపాతీలను రాత్రి తయారు చేసి ఉదయం తింటే మంచిదని కూడా కొందరు భావిస్తుంటారు. కానీ ఇది ఎంత మాత్రం మంచిది కాదని, నిల్వ ఉంచిన ఏ ఆహారం అయినా సరే అందులో బాక్టీరియా అధికంగా ఉంటుంది కనుక అలాంటి ఆహారాలను తింటే ఫుడ్ పాయిజనింగ్ బారిన పడే ప్రమాదం ఉంటుందని, కనుక నిల్వ ఉంచిన చపాతీలను కూడా తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు. అయితే చపాతీలను పూర్తిగా మానేయడం మంచిది కాదు, అలాగని చెప్పి మరీ అతిగా కూడా తినకూడదు. ఏ ఆహారం అయినా సరే మోతాదులో తింటేనే ప్రయోజనాలు కలుగుతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరీ అతిగా తినడం ప్రమాదాలను కలిగిస్తుందని తెలుసుకోవాలి. మోతాదులో తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు.