Bruxism | చాలా మంది నిద్రించేటప్పుడు వివిధ రకాల భంగిమల్లో బెడ్‌పై పడుకుంటారు. గాఢ నిద్రలో ఉన్నా కూడా రకరకాల భంగిమల్లో నిద్రిస్తుంటారు. ఎవరి సౌకర్యానికి తగినట్లు వారు అలా చేస్తారు. అయితే కొందరు నిద్రలో ఉన్నప్పుడు దంతాలను కొరుకుతారు. ముఖ్యంగా పిల్లలు ఈ విధంగా ఎక్కువగా చేస్తారు. దీని వల్ల వారు నిద్రించేటప్పుడు దంతాలను కొరికితే ఆ శబ్దం బయటకు వినిపిస్తుంది. కానీ పిల్లలు లేదా పెద్దలు ఎవరైనా సరే దంతాలను కొరికితే అలా చేస్తున్నట్లు వారికి తెలియదు. కానీ పక్కన ఉన్న వారికి మాత్రం ఆ శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. అయితే ఎవరైనా ఇలా ఎందుకు చేస్తారు.. అనే విషయంపై ఇప్పటికీ వైద్య నిపుణులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కానీ ఇందుకు పలు కారణాలు ఉంటాయని మాత్రం వారు చెబుతున్నారు.
సాధారణంగా పెద్దల్లో ప్రస్తుతం ఆందోళన, ఒత్తిడి, కోపం, నిరాశ, ఉద్రిక్తత అధికంగా ఉంటున్నాయి. అందుకు అనేక అంశాలు కారణం అవుతున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నవారు నిద్రలో దంతాలను అధికంగా కొరుకుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే మానసిక సమస్యలు మరీ తీవ్రంగా ఉన్నవారు కూడా నిద్రలో ఇలాగే చేస్తారని అంటున్నారు. ఇక చిన్నారులు మాత్రం దంతాలను కొరికేందుకు వేరే కారణాలు ఉంటాయి. చిన్నారుల పేగులు లేదా జీర్ణాశయంలో పురుగులు ఎక్కువగా ఉన్నా, వారిలో క్యాల్షియం, మెగ్నిషియం వంటి లోపాలు ఉన్నా అలాంటి వారు నిద్రలో దంతాలను కొరుకుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. కనుక చిన్నారులకు ఈ సమస్య తగ్గేందుకు గాను వారికి రోజూ పౌష్టికాహారం ఇస్తే సరిపోతుంది. అదే వారి జీర్ణవ్యవస్థలో పురుగులు ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.
నిద్రలో దంతాలను కొరికే పెద్దలకు ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమీ ఉండదు. కానీ ఈ సమస్యకు కారణం అయ్యే అంశాల పట్ల దృష్టి సారించాల్సి ఉంటుంది. అంటే వారికి ఉండే ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దీని వల్ల నిద్రలో దంతాలను కొరికే సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే మెగ్నిషియం అధికంగా ఉండే ఆహారాలను తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. మెగ్నిషియం మనకు ఎక్కువగా పొద్దు తిరుగుడు విత్తనాలు, గుమ్మడి విత్తనాలు, అవిసె గింజలు, చియా సీడ్స్, బాదంపప్పు, నువ్వులు, ఓట్స్, జీడిపప్పు, పిస్తా, పల్లీలు, అరటి పండ్లు వంటి ఆహారాల్లో లభిస్తుంది. కనుక వీటిని తరచూ తింటే మెగ్నిషియం సమృద్ధిగా లభించి ఆ సమస్య తగ్గుతుంది.
ఇక నిద్రలో దంతాలను కొరికే సమస్య ఉన్నవారు రాత్రి పూట పాలలో పసుపు లేదా మిరియాల పొడి కలిపి తాగుతుంటే ఉపయోగం ఉంటుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. కొందరు రాత్రి పూట చలికి వణికినట్లు ఫీలవుతారు. అలాగే చలికాలంలోనూ అలాంటి వారికి రాత్రి పూట వణుకు ఉంటుంది. ఈ కారణంగా కూడా కొందరు నిద్రలో దంతాలను కొరుకుతారని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. కనుక చుట్టూ ఉండే పరిసరాలను వేడిగా ఉంచుకోవాలి. ఇందుకు అవసరం అయితే రూమ్ హీటర్లను వాడవచ్చు. లేదా శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆహారాలను తినాలి. అలాగే రోజుకు 2 సార్లు ఏవైనా హెర్బల్ టీలను తాగుతున్నా ఉపయోగం ఉంటుంది. దీంతోపాటు యోగా, ధ్యానం వంటివి అనుసరించినా కూడా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.