ఇటీవల కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాలో ఓ ఐదేండ్ల బాలిక అమీబిక్ మెనింగో ఎన్సఫాలిటిస్తో మరణించింది. మే 13 నుంచి ఆ బాలికకు కోజికోడ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల దవాఖానలో చికిత్స జరిగింది. వారానికి పైగానే వెంటిలేటర్‌పై గడిపింది. డాక్టర్లు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆ బాలికను కాపాడలేకపోయారు. మెదడుకు సోకే ఈ అసాధారణమైన అమీబిక్ మెనింజో ఎన్‌సైఫలైటిస్ అంటే ఏమిటి..?
మెదడును తినేసే అమీబా (బ్రెయిన్ ఈటింగ్ అమీబా)ను శాస్త్రీయంగా నెగ్లేరియా ఫోలేరి అని పిలుస్తారు. అరుదుగానే అయినప్పటికీ ఇది మెదడులో తీవ్రమైన ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. దీన్ని ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్‌సఫాలిటిస్ (పీఏఎం) అంటారు. నెగ్లేరియా ఫోలేరి అనేది వెచ్చటి మంచినీటి వనరులైన చెరువులు, నదులు, వేడినీటి బుగ్గలు, నిర్వహణ సరిగ్గా లేని స్విమింగ్‌పూల్స్‌లో కనిపించే ఏకకణ జీవి అమీబా. ఇది 30 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పైబడిన ఉష్ణోగ్రతలో అభివృద్ధి చెందుతుంది.
ఇన్ఫెక్షన్కు కారణాలు
నెగ్లేరియా ఫోలేరి అమీబా ఉన్న నీళ్లు ముక్కు ద్వారా మన శరీరంలోకి ప్రవేశించడం వల్ల ఇన్ఫెక్షన్ తలెత్తుతుంది. ఈతకొట్టడం, డైవింగ్ చేయడం, శ్వాస సరిగ్గా ఆడటానికి నాసల్ ఇరిగేషన్ విధానాన్ని పాటించడం మొదలైన వాటి ద్వారా కలుషిత జలాలు ముక్కు నుంచి శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇలా లోపలికి చొరబడిన అమీబా మెదడును చేరుకుంటుంది. అక్కడ అది ఇన్ఫ్లమేషన్కు కారణమవుతుంది. మెదడు కణజాలాన్ని ధ్వంసం చేయడం మొదలుపెడుతుంది. దీన్నే పీఏఎం అంటారు.
లక్షణాలు
బ్యాక్టీరియల్, వైరల్ మెనింజైటిస్లతో తలెత్తే తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు లాంటివే బ్రెయిన్ ఈటింగ్ అమీబాలోనూ కనిపిస్తాయి. ఐదు నుంచి ఏడు రోజులలోపు రోగి మెదడులో మార్పులు కనిపిస్తాయి. కపాలం లోపల ఒత్తిడి, సీజర్లు, హల్యూసినేషన్స్ అభివృద్ధి చెందుతాయి. కొన్నిసార్లయితే అమీబా మెదడు కణజాలాన్ని మరింతగా ధ్వంసం చేయడంతో కోమాలోకీ వెళ్లిపోయే పరిస్థితి దాపురిస్తుంది. యాంటీ మైక్రోబియల్ చికిత్స చేసినప్పటికీ పీఏఎంతో మరణాల రేటు ఎక్కువగానే ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. అమీబా సోకిన తొమ్మిది రోజుల తర్వాత పీఏఎం లక్షణాలు బహిర్గతం
అవుతాయి.
నివారణ మార్గాలు
నిజానికి బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు తక్కువగానే ఉంటాయి. అయినప్పటికీ కొన్ని నివారణ చర్యలు తీసుకుంటే ఆ కొంచెం ముప్పు కూడా తగ్గుతుంది.
చికిత్స
పీఏఎం ముదరకుండా తొలిదశల్లోనే రోగ నిర్ధారణ చేసుకోవాలి. లేకుంటే ఇన్ఫెక్షన్ తీవ్రమై ఒక్కోసారి ప్రాణాంతకం కావొచ్చు. ఇక చికిత్సలో యాంటిమైక్రోబియల్ మందులు, మద్దతు చికిత్స, మెదడు వాపు తగ్గడానికి చికిత్స మొదలైనవి భాగంగా ఉంటాయి.