న్యూఢిల్లీ : శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మన జీవక్రియల వేగం నిర్ధేశిస్తుంది. శరీరం బరువును తగ్గించడంతో పాటు మెటబాలిజం బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను రెగ్యులేట్ చేయడం, రక్త సరఫరాను మెరుగుపరచడం, కణాల వృద్ధి, పునరుద్ధరణ వంటి ఎన్నింటినో ఇది చక్కబెడుతుంది. వయసు పెరిగే కొద్దీ మెటబాలిజం రేటు కూడా మందగిస్తుంది. శారీరక వ్యాయామం, కండరాలు బలహీనపడటంతో జీవక్రియల వేగం కూడా తగ్గుతుంటుంది.
అయితే వ్యాయామంతో పాటు ఇతర జాగ్రత్తలతో మెటబాలిజం రేటును పరుగులు పెట్టించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో ద్రవాలు తీసుకోవడం అత్యవసరం. తగినంత నీరుతో పాటు గ్రీన్‌టీ, కాఫీతోనూ మెటబాలిజం రేటు పెరుగుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. పండ్లు, కూరగాయల్లో ఉండే క్యుర్సెటిన్ అనే ఫ్లేవనాయిడ్‌తో జీవక్రియలు వేగం పుంజుకుంటాయని పరిశోధకులు చెబుతున్నారు. టమాటాలు, బెర్రీస్, యాపిల్స్ వంటి పండ్లలో ఈ ఫ్లేవనాయిడ్ ఉంటుంది.
ఇక శరీరానికి పుష్టిని ఇచ్చే పోషకాలతో కూడిన ప్రొటీన్‌ను తీసుకోవాలి. గుడ్లు, చికెన్, ఆకుకూరలు, బీన్స్, నట్స్‌ను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక పరిమితికి మించి చక్కెర తీసుకోవడం తగ్గించాలి. చక్కెరలో ఉండే ఫ్రక్టోజ్ జీవక్రియల వేగాన్ని నియంత్రిస్తుంది. పండ్లలో కూడా ఫ్రక్టోజ్ ఉంటుంది కాబట్టి వాటిని పరిమితంగా తీసుకోవాలి. ఇక మన వంటింట్లో దొరికే అల్లం, మిరియాల పొడి, పసుపు వంటివి బరువును తగ్గించడంలో సహాయపడుతూ మెటబాలిజంను పెంచుతాయని పరిశోధకులు వెల్లడించారు.