మూత్రాశయంలో కణాలు నియంత్రణ లేకుండా పెరిగిపోయినప్పుడు మూత్రాశయ క్యాన్సర్ వస్తుంది. భారతదేశంలో మూత్రాశయ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. అయితే, ఇంతటి ఆరోగ్య సమస్యను చాలామంది పట్టించుకోకపోవడం ఆందోళనకరం. పర్యావరణ, వృత్తిపరమైన, జీవనశైలి కారణాల వల్ల ఈ సమస్య తలెత్తుతున్నది.
మితిమీరిన పొగాకు వినియోగం, పారిశ్రామిక కాలుష్యం, వ్యాధి నిర్ధారణ ఆలస్యంగా జరగడం లాంటివి మూత్రాశయ క్యాన్సర్కు దారితీస్తున్నాయి. ఇది స్త్రీలకంటే పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి, నిశ్శబ్దంగా ముంచుకొస్తున్న ఈ ముప్పు గురించి సత్వరమే తగిన కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉంది.
మూత్రాశయ క్యాన్సర్ ముప్పును నివారించుకోవడానికి కొన్ని జీవనశైలి మార్పులు చేసుకోవాలి. ధూమపానం వదిలిపెట్టడం, పారిశ్రామిక రసాయనాలకు గురికాకుండా చూసుకోవడం, ద్రవాలు (ఫ్లూయిడ్స్) ఎక్కువగా తాగడం, నాణ్యమైన పోషకాహారం తీసుకోవడం ద్వారా ఈ ముప్పు తగ్గుతుంది.