Grapes | ద్రాక్ష పండ్లు మనకు దాదాపుగా ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. నలుపు, ఆకుపచ్చ రంగులో ఉండే ద్రాక్ష పండ్లు మనకు ఎక్కువగా లభిస్తుంటాయి. అయితే ఏ రంగులో ఉన్నా కొన్ని రకాల పోషకాలు మాత్రం ఈ రెండు పండ్లలో కామన్‌గా ఉంటాయి. నలుపు, ఆకుపచ్చ రెండు రకాల ద్రాక్షలలోనూ విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను బలంగా మారుస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని వల్ల చర్మానికి సహజసిద్ధమైన నిగారింపు వస్తుంది. రెండు రకాల ద్రాక్షల్లోనూ విటమిన్ కె ఉంటుంది. ఇది ఎముకలను బలంగా మారుస్తుంది. అలాగే గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది. దీంతో తీవ్ర రక్త స్రావం జరగకుండా అడ్డుకోవచ్చు. ద్రాక్షల్లో పలు రకాల బి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెటబాలిజంను మెరుగు పరుస్తాయి. శరీరానికి శక్తి లభించేలా చేస్తాయి.
ద్రాక్ష పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ నియంత్రణలోకి వస్తుంది. శరీరంలోని ద్రవాలు సైతం సమతుల్యంలో ఉంటాయి. ద్రాక్ష పండ్లలో ఉండే మాంగనీస్ ఎముకలు నిర్మాణం అయ్యేందుకు దోహదం చేస్తుంది. అలాగే మెటబాలిజంను మెరుగు పరుస్తుంది. ద్రాక్షలలో ఫైబర్ కూడా అధికంగానే ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ద్రాక్ష పండ్లలో ఉండే నీరు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా రక్షిస్తుంది. ఆకుపచ్చ, నలుపు రెండు రకాల ద్రాక్ష పండ్లలోనూ రెస్వెరెట్రాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మంపై ముడతలు పడకుండా చేస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు. క్యాన్సర్ రాకుండా రక్షిస్తుంది.
నలుపు రంగు ద్రాక్షల్లో ఆంథో సయనిన్స్ అధికంగా ఉంటాయి. అందువల్లే ఆ ద్రాక్ష పండ్లకు ఆ రంగు వస్తుంది. ఈ ద్రాక్షల్లో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు యాంటీ ఇన్ ఫ్లామేటరీ సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. బీపీని తగ్గిస్తాయి. మెదడు ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరిగేలా చేస్తాయి. దీంతో నాడీ సంబంధ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. నలుపు రంగు ద్రాక్షల్లో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి. ఇవి పలు రకాల క్యాన్సర్ కణాలు పెరగకుండా రక్షిస్తాయి. ఇక ఆకుపచ్చ రంగు ద్రాక్షల్లో ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల పరంగా చూసుకుంటే ఏ ద్రాక్ష మంచిది అని చాలా మందికి సందేహం వస్తుంది. ఇందుకు నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
పోషకాలు లేదా ఆరోగ్య ప్రయోజనాలు రెండింటినీ అందించడంలో నలుపు రంగు ద్రాక్షలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిల్లో ఉండే ఆంథో సయనిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు గుండెను రక్షిస్తాయి. అలాగే వాపులను తగ్గిస్తాయి. ఆకుపచ్చ రంగు ద్రాక్షలను తింటే షుగర్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి. కనుక ఇవి షుగర్ ఉన్నవారికి మంచివి కావు. వారు నలుపు రంగు ద్రాక్షలను తినాలి. ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా నలుపు రంగు ద్రాక్షలే మనకు ప్రయోజనాలను అందిస్తాయి. అయితే వాటిల్లో విత్తనాలు ఉన్నవాటినే తినాలి. అలాగే కాస్త పులుపు ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి నలుపు రంగు ద్రాక్షలను తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.