పర్యావరణానికి హానికరం కాదని చెబుతున్న ‘బయోడీగ్రేడబుల్’ ప్లాస్టిక్.. మానవ ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నదట. ముఖ్యంగా పేగులకు హానికలిగించే ‘మైక్రోప్లాస్టిక్’ను విడుదల చేసి.. జీవక్రియను దెబ్బతీస్తున్నదట. తాజాగా, అమెరికా-చైనా పరిశోధకులు నిర్వహించిన ఓ అధ్యయనం ఈ విషయాలను వెల్లడించింది. బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ తయారీలో ఎక్కువగా ‘పాలీలాక్టిక్ యాసిడ్’ను వినియోగిస్తారనీ, ఇది ‘మైక్రోప్లాస్టిక్’ను విడుదల చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ మైక్రోప్లాస్టిక్ కణాలు దీర్ఘకాలంలో మెటబాలిజంపై ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలుకలలో నిర్వహించిన వివిధ పరిశోధనల్లో ఈ ప్లాస్టిక్ కణాలు పేగులను దెబ్బతీసి.. వాటి జీవక్రియలనూ మార్చినట్టు కనుగొన్నారు.
కొన్ని పరిశోధనల ప్రకారం.. సగటున ప్రతివ్యక్తి ఏటా తనకు తెలియకుండానే 39,000 నుంచి 52,000 మైక్రోప్లాస్టిక్ కణాలను తీసుకుంటున్నాడట. ఇక గాలిద్వారా శరీరంలోకి వెళ్లేవాటినీ కలుపుకొంటే.. ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే.. మనుషుల రక్తం, కాలేయం, ఊపిరితిత్తులతోపాటు తల్లి పాలలోనూ మైక్రోప్లాస్టిక్ కనుగొన్నట్లు వెల్లడించారు. ఇవి మానవుల్లో జీవక్రియను ప్రభావితం చేస్తాయనీ, రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తాయనీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, బయోడీగ్రేడబుల్ అయినప్పటికీ.. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని సూచిస్తున్నారు. వాటికి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలని చెబుతున్నారు.