నా మొహం మీద అక్కడక్కడా గోధుమరంగు మచ్చలు ఏర్పడ్డాయి. ఎన్ని చిట్కాలు ప్రయోగించినా ఫలితం ఉండటం లేదు. ఈ సమస్యకు పరిష్కారం లేదా?
గోధుమరంగు మచ్చలనే ఏజ్ స్పాట్స్ అనీ పిలుస్తారు. ఎండకు తిరిగేవారిని బాగా ఇబ్బంది పెడతాయి. వయసు ప్రభావాన్నీ కాదనలేం. చర్మానికి రంగునిచ్చే పిగ్మెంట్ సెల్స్‌లో మెలనిన్ అనే రసాయనం మోతాదుకు మించి ఉత్పత్తి కావడం వల్ల ఈ సమస్య వస్తుంది. అతి నీలలోహిత కిరణాల ప్రభావం వల్లే ఇదంతా జరుగుతుంది. దీని నుంచి తప్పించుకోడానికి ఒకటే మార్గం.. తీవ్రమైన ఎండలు ఉన్నప్పుడు బయటికి వెళ్లకపోవడమే మంచిది. వెళ్లినా, 50 ఎస్పీఎఫ్.. సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ కలిగిన సన్‌స్క్రీన్ లోషన్ రాసుకున్నాకే కాలు బయట పెట్టాలి. ఒంటినిండా దుస్తులు ధరిస్తే మేలు. గోధుమరంగు మచ్చలు ప్రమాదకరమేం కాదు. కాకపోతే వాటికి వాపు వచ్చినా, చుట్టుపక్కలకు విస్తరించినా, రక్తస్రావం జరిగినా, స్పర్శ మందగించినా.. ఇలా ఏ అసాధారణమైన మార్పు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. వాటిని పూర్తిగా తొలగించుకోవాలంటే.. చిట్కాల జోలికి వెళ్లకుండా నిపుణుల సహకారం తీసుకోవాలి. లేజర్ చికిత్స ద్వారా కానీ, ఇతర ఆధునిక వైద్య విధానాల ద్వారా కానీ సులభంగానే తొలగిస్తారు.
– డాక్టర్ అనున్యా రెడ్డి ఇ.ఎన్.టి సర్జన్, కాస్మటాలజిస్ట్,ఫేషియల్ కాస్మటిక్ సర్జన్