Beer Vs Whisky | ఆల్కహాల్ విషయానికి వస్తే బీర్, జిన్, వోడ్కా నుండి విస్కీ, రమ్ వరకు చాలా మందికి ఇవి అన్నీ తెలిసే ఉంటుంది. మితంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మన శరీరానికి కూడా మేలు కలుగుతుందని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. మితంగా ఆల్కహాల్ తీసుకోవడం మంచిదే అయినప్పటికి బీర్, విస్కీలలో ఏది మంచిది, ఏది ఆరోగ్యకరమైనదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్కాహాలిక్ పానీయాల విషయానికి వస్తే బీర్, విస్కీ రెండు కూడా ప్రజాదరణ పొందినవే. అయితే వాటిలో ఉండే క్యాలరీలు, ఆల్కహాల్ కంటెంట్, పోషకవిలువలు, దీర్ఘకాలిక ప్రభావాలు వాటి మధ్య వ్యత్యాసాన్ని సృష్టిస్తాయి. సాధారణంగా బీర్ లో 4 నుండి 6 శాతం ఆల్కహాల్ ఉంటుంది. ఆల్కహాల్ తక్కువగా ఉన్న కారణంగా దీని వినియోగం ఎక్కువగా ఉంటుంది. విస్కీలో 40 శాతం కంటే ఎక్కువగా ఆల్కహాల్ ఉంటుంది. దీనిని కొద్దిగా తీసుకున్నా కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
ఆల్కహాల్ కంటెంట్ ఎలా ఉన్నప్పటికీ వీటిని మితంగా తీసుకోవడం అవసరం. బీర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలోకి ఆల్కహాల్ ఎక్కువగా వెళ్తుంది కనుక వీటిని మితంగా తీసుకోవడం మంచిది. అలాగే బీర్ లో కార్బొహైడ్రేట్స్, క్యాలరీలు అధికంగా ఉంటాయి. బీర్ లో దాదాపు 150 నుండి 200 క్యాలరీలు ఉంటాయి. విస్కీలో కార్బొహైడ్రేట్స్, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. 60ఎంఎల్ పెగ్లో దాదాపు 70 క్యాలరీలు ఉంటాయి. బీర్ ను తీసుకోవడం వల్ల శరీర బరువు పెరుగుతుంది. కనుక బీర్ ను కూడా మితంగా తీసుకోవడం అవసరం. ఇక గుండె ఆరోగ్యం విషయానికి వస్తే రెండు కూడా ప్రయోజనాలను అందిస్తాయని చెప్పవచ్చు. అధ్యయనాల ప్రకారం బీర్ లో పాలీఫినాల్స్, బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి.
విస్కీలో ఎల్లాజిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో దోహదపడుతుంది. అయితే విస్కీలో అధిక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కనుక బీర్ కంటే విస్కీ గుండె ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా కాలేయ ఆరోగ్యం విషయానికి వస్తే అధికంగా తీసుకోవడం వల్ల ఇవి రెండు కూడా కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. బీర్ ఎక్కువగా తాగడం వల్ల ఆల్కహాల్ ఎక్కువగా శరీరంలోకి వెళ్లి కాలేయంపై ఒత్తిడిని కలిగిస్తుంది. విస్కీ బలంగా ఉన్నప్పటికీ దీనిని తక్కువగా తాగుతారు కనుక ఆల్కహాల్ ఎక్స్పోజర్ ను తగ్గిస్తుంది. బీర్ ను ఎక్కువగా తీసుకోవడం కంటే విస్కీని తక్కువగా తీసుకోవడం వల్ల కాలేయానికి ఎక్కువగా హాని కలగకుండా ఉంటుంది.
జీర్ణక్రియ, పేగు ఆరోగ్యానికి వస్తే బీర్ లో ప్రోబయోటిక్స్, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. పేగు ఆరోగ్యానికి తోడ్పడతాయి. అయితే బీర్ ను తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. విస్కీలో గ్లూటెన్ ఉండదు. దీనిని తీసుకోవడం వల్ల కొందరిలో జీర్ణక్రియ సులభతరం అవుతుంది. ఇక దేనిని తీసుకోవాలి అనే విషయానికి వస్తే బరువు పెరగకూడదు అనుకునే వారు విస్కీని ఎంచుకోవడం మంచిది. గుండె ఆరోగ్యానికి రెండు కూడా ఎంతో కొంత మేలు చేస్తాయి. అయితే కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రెండింటిని మితంగా తీసుకోవడం మంచిది. బీర్, విస్కీ రెండు కూడా మన శరీరానికి లాభాన్ని , నష్టాన్ని కలిగిస్తాయి. ఆల్కహాల్ కంటెంట్ ఉన్న ఏ పానీయాన్ని అయినా మితంగా తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు.