Bed Time Health Tips | రోజూ మనం ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి మళ్లీ నిద్రించే వరకు అనేక పనులు చేస్తుంటాం. అయితే కొన్ని రకాల పనుల వల్ల మనం అనారోగ్య సమస్యల బారిన పడుతుంటాం. ఆలస్యంగా భోజనం చేయడం, అతిగా తినడం, జంక్ ఫుడ్‌ను తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, ధూమపానం, మద్యపానం వల్ల రోగాల బారిన పడుతుంటాం. దీనికి తోడు వాతావరణ కాలుష్యం, తాగే నీరు, తినే తిండి కూడా మనకు రోగాలు వచ్చేందుకు కారణం అవుతున్నాయి. అయితే రోగాల బారిన పడకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించాలి. ముఖ్యంగా రాత్రి పూట కొన్ని సూచనలు పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. రాత్రి పూట మీరు కొన్ని రొటీన్ సూచనలను గనక పాటిస్తే ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. రోగాలు దరి చేరకుండా ఉంటాయి. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రి పూట మీ శరీరంలోని కండరాలకు మసాజ్ చేయండి. దీంతో మీకు ఉండే ఒత్తిడి, నొప్పులు అన్నీ పోతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. దీని వల్ల నిద్ర చక్కగా పట్టడమే కాదు, మరుసటి రోజు ఉదయం త్వరగా నిద్ర లేస్తారు. ఎంతో ఉత్సాహంగా ఉంటారు. రోజంతా ఉత్సాహంగా పనిచేస్తారు. అలాగే రాత్రి నిద్రకు ముందు కాసేపు ధ్యానం చేయడాన్ని అలవాటు చేసుకోండి. కనీసం ఒక 10 నిమిషాల పాటు అయినా సరే రాత్రి పూట ధ్యానం చేస్తే మంచిది. ధ్యానం వల్ల కూడా మైండ్ ఎంతగానో రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. డిప్రెషన్ నుంచి బయట పడతారు. ధ్యానం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. రాత్రి పూట మైండ్ రిలాక్స్ అయి నిద్ర చక్కగా పడుతుంది.
రాత్రి పూట నిద్రకు ముందు ఎసెన్షియల్ ఆయిల్స్‌ను వాసన చూడాలి. ఇవి అరోమా థెరపీగా పనిచేస్తాయి. దీని వల్ల కూడా మైండ్ రిలాక్స్ అవుతుంది. ఆందోళన నుంచి బయట పడవచ్చు. పడుకున్న వెంటనే గాఢ నిద్ర పడుతుంది. ఒత్తిడి మటుమాయం అవుతుంది. మరుసటి రోజంతా ఉత్సాహంగా, యాక్టివ్‌గా ఉండవచ్చు. అలాగే రాత్రి పూట తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారాలను తినండి. ఆహారం త్వరగా జీర్ణం అయితే రాత్రి పూట మన శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. దీంతో శరీరం తనకు తాను మరమ్మత్తులు చేసుకుంటుంది. కొత్త కణాలను నిర్మిస్తుంది. దీంతో వ్యాధులు త్వరగా తగ్గుముఖం పడతాయి. అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటారు. ముఖ్యంగా చర్మ కణాలు రిపేర్ అవుతాయి. దీంతో యవ్వనంగా, కాంతివంతంగా కనిపిస్తారు. చర్మం మృదువుగా మారి తేమగా ఉంటుంది.
రాత్రి పూట వీలైతే 10 నిమిషాల పాటు అయినా సరే ఏదైనా పుస్తకాన్ని చదవండి. పుస్తకాలను చదవడం వల్ల చక్కగా నిద్ర పడుతుంది. మానసిక ఆందోళన దూరమవుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. మనస్సు రిలాక్స్ అయినట్లు ఫీలింగ్ కలుగుతుంది. మరుసటి రోజు ఉత్సాహంగా ఉంటారు. అలాగే రాత్రి పూట చక్కగా నిద్ర పట్టాలంటే మధ్యాహ్నం ఎట్టి పరిస్థితిలోనూ నిద్రించకూడదు. అంతగా కావాలనుకుంటే బెడ్ మీద పడుకుని 15-20 నిమిషాల పాటు కళ్లు మూసుకుని ధ్యానం చేయండి. అంతేకానీ నిద్ర పోకండి. దీని వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. అదేవిధంగా మీ రూమ్‌లో వీలైనంత వరకు ఎలాంటి వెలుతురు పడకుండా చూడండి. కేవలం బెడ్ లైట్ వెలుతురు మాత్రమే పడేలా చూడండి. ముఖ్యంగా నీలం రంగు బెడ్ లైట్ అయితే మంచిది. దీంతో త్వరగా నిద్రపడుతుంది. ఇలా కొన్ని సూచనలను మీరు పాటిస్తే రాత్రి పూట చక్కగా నిద్ర పట్టడమే కాదు, ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మరుసటి రోజు హుషారుగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు.