Beauty tips : చర్మం అందంగా, యవ్వనంగా కనిపించాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. పురుష పుంగవులు ఈ విషయంలో తక్కువేమీ కాదు. అందంగా కనిపించడం కోసం ఇప్పుడు చాలా రకాల బ్యూటీ ట్రీట్మెంట్లు అందుబాటులోకి వచ్చాయి. చర్మ వైద్యుల పర్యవేక్షణలో జరిగే ఈ బ్యూటీ చికిత్సలలో బొటాక్స్ ట్రీట్మెంట్ కూడా ఒకటి. బొటాక్స్ ట్రీట్మెంట్ వల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. ఇంతకీ బొటాక్స్ అంటే ఏమిటి..? ఇది చర్మాన్ని యవ్వనంగా ఎలా మారుస్తుంది..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
చర్మంలో ముడతలను, గీతలను తగ్గించడానికి ఉద్దేశించిన ఒక ప్రసిద్ధ ఇంజెక్షన్ బ్యూటీ ట్రీట్మెంట్ను బొటాక్స్ అంటారు. వైద్యులు ముందుగా ముఖంపై నంబింగ్ క్రీమ్ రాస్తారు. బొటాక్స్ చేయడానికి నిర్దేశించిన సూదిని ఉపయోగించి చర్మం మీద ఇంజెక్షన్ చేస్తారు. ఈ ప్రక్రియ 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు సమయం తీసుకుంటుంది.
అయితే బొటాక్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే జీవితకాలం చర్మం యవ్వనంగా ఉంటుందని అనుకుంటే పొరపాటే. బొటాక్స్ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ 8 నుంచి 12 నెలల వరకు ఉంటుంది. ఈ ట్రీట్మెంట్తో ప్రయోజనాలు ఉన్నట్టే ప్రతికూలతలు కూడా ఉంటాయి.
ప్రయోజనాలు..
1. బొటాక్స్ ట్రీట్మెంట్ చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది.
2. బొటాక్స్ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ను నుదుటిపైన, కళ్ల పైన ముడతలు తగ్గించడానికి ఉపయోగిస్తారు.
3. బొటాక్స్ ట్రీట్మెంట్తో ముఖంపై అధికంగా చెమటపట్టే సమస్య కూడా తగ్గుతుంది.
4. బొటాక్స్ ట్రీట్మెంట్ వల్ల కళ్ల కింద నల్లని వలయాలు తగ్గుతాయి. కళ్ల కింది నల్లని వలయాలు తగ్గించుకోవడానికి చాలామంది బొటాక్స్ ట్రీట్మెంట్ తీసుకుంటారు.
ప్రతికూలతలు
1. బొటాక్స్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కొందరిలో తలనొప్పి లాంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మైగ్రెయిన్ సమస్య ఉన్నవారిలో బొటాక్స్ ఇంజెక్షన్ వల్ల తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ.
2. ముఖం, పెదవులు, గొంతు వంటి ప్రదేశాలలో తీవ్రమైన వాపు, అలెర్జీ లాంటివి కూడా బొటాక్స్ ట్రీట్మెంట్ వల్ల వస్తాయి.
3. బొటాక్స్ ట్రీట్మెంట్ కొన్నిసార్లు శ్వాస సమస్యలు కలిగిస్తుంది. అయితే సమస్యకు పరిష్కారం కూడా ఉంటుంది.
ఖర్చెంత..? : బొటాక్స్ ట్రీట్మెంట్ ఖర్చు ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటుంది. భారతదేశంలో అయితే బొటాక్స్ ట్రీట్మెంట్ ఖర్చు రూ.15 వేల నుంచి రూ.36 వేల మధ్య ఉంటుంది.