జుట్టుని అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలని పార్లర్కి వెళ్లింది హైదరాబాద్కి చెందిన 50 ఏండ్ల మహిళ. తీరా అక్కడికి వెళ్లాక ఆమెకు ఊహించని పరిస్థితి ఎదురైంది.హెయిర్ వాష్ తర్వాత జుట్టు కట్ చేసే టైంలో ఆమెకు స్ట్రోక్ వచ్చింది. దాంతో, అప్పటిదాకా హుషారుగా ఉన్న ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సెలూన్ వాళ్లకు అసలు ఏం జరిగిందో అర్ధం కాలేదు. ఈ విషయం తెలిశాక అదేంటీ! స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా? పార్లర్కి వెళ్తే ఇలాంటి సమస్య కూడా ఉందా! అని ఆశ్చర్యపోతున్నారు చాలామంది. ఆమెకు స్ట్రోక్ ఎందుకు వచ్చిందంటే…హెయిర్ వాష్ చేసేటప్పుడు చేతులతో వెంట్రుకల్ని వెనక్కి, ముందుకి లాగుతుంటే మెడ దగ్గరి రక్తనాళాల మీద ఒత్తిడి పడుతుంది. అలా మెదకు రక్తాన్ని చేరవేసే ముఖ్యమైన రక్తనాళం మీద ఒత్తిడి పడి, మెదడుకి రక్తం అందక స్ట్రోక్ వచ్చిందని చెప్పారు ఆమెకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు. ఈ సమస్యని బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్ అంటారని డాక్టర్లు చెప్పారు.
ఐదుగురిని గమనించాక
1993లో అమెరికన్ మెడిసిన్ అసోసియేషన్ జర్నల్లో మైకేల్ వీన్ ట్రాబ్ అనే డాక్టర్ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్ పేరుని మొదటిసారి ప్రస్తావించాడు. హెయిర్ వాష్ కోసం బ్యూటీ పార్లర్కి వెళ్లొచ్చిన తర్వాత ఐదుగురు మహిళల్లో తీవ్రమైన న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ రావడం గమనించాడు. పార్లర్కి వెళ్లొచ్చాక మగతగా అనిపించడం, బ్యాలెన్స్ కోల్పోవడంతో పాటు ముఖమంతా మొద్దుబారినట్టు ఉంటుందని చెప్పారు ఆ ఐదుగురు మహిళలు. వీళ్లలో నలుగురు స్ట్రోక్ బారిన పడ్డారు. వాళ్ల లక్షణాల్ని బట్టి ఈ సమస్యకు బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్ అని పేరు పెట్టాడు డాక్టర్ మైకేల్.
రక్తం గడ్డ కట్టడం వల్లనే
మెడ ముందూ, వెనకాల రెండు ముఖ్యమైన రక్తనాళాలు ఉంటాయి. మెడ వెనక ఉండే రక్తనాళాల్ని వర్టిబ్రల్ ఆర్టేరీస్ అంటారు. పార్లర్లోహెయిర్ వాష్ చేస్తున్న టైంలో వీటిపై ఒత్తిడి పడడం వల్ల ఇవి దెబ్బతింటాయి. దాంతో అక్కడ రక్తం గడ్డకడుతుంది. అప్పుడు మెదడుకి రక్తం అందక స్ట్రోక్ వస్తుంది. అధిరోస్ల్కీరోసిస్ సమస్య ఉన్నవాళ్లు ఇలాంటి స్ట్రోక్స్ బారిన పడతారని చెప్తున్నారు డాక్టర్లు.