Barley Water Benefits | ఆరోగ్యంగా ఉండేందుకు అందరూ రకరకాల మార్గాలను అనుసరిస్తున్నారు. ఆరోగ్యవంతమైన ఆహారం తినడంతోపాటు రోజూ యోగా లేదా వ్యాయామం చేయడం, వేళకు నిద్రపోవడం చేస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే ఎలాంటి వ్యాధులు రాకుండా 100 ఏళ్లు జీవించవచ్చని చాలా మందికి అర్థం అవుతోంది. అందుకనే ఆరోగ్యకరమైన మార్గాల వైపు చూస్తున్నారు. అయితే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు పలు రకాల ఆహారాలు కూడా ఎంతగానో దోహదపడతాయి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల మనకు అనేక విధాలుగా మేలు జరుగుతుంది. అయితే అలాంటి ఆహారాలు మనకు అందుబాటులోనే ఉన్నాయి. కానీ చాలా మందికి వాటి గురించి తెలియదు. వాటిల్లో బార్లీ గింజలు కూడా ముఖ్యమైనవే అని చెప్పవచ్చు.
బార్లీ గింజలు మనకు మార్కెట్లో లభిస్తాయి. వీటిని బీర్ తయారీకి ఉపయోగిస్తారని అందరికీ తెలిసిందే. అయితే బార్లీ గింజలను నీటిలో మరిగించి ఆ నీళ్లను రోజూ తాగుతుంటే ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. బార్లీ గింజలను గుప్పెడు తీసుకుని 2 గ్లాసుల నీటిలో వేసి మరిగించాలి. అనంతరం ఈ నీళ్లను వడకట్టి ఒక గ్లాస్ మోతాదులో రోజూ ఉదయం, సాయంత్రం తాగాలి. రెండు సార్లు తాగలేమని అనుకునేవారు రోజుకు 1 గ్లాస్ తాగవచ్చు. బార్లీ గింజల నీళ్లు చప్పగా ఉంటాయి. కనుక రుచి కోసం ఆ నీటిలో తేనె, నిమ్మరసం వంటివి కలిపి కూడా తాగవచ్చు. ఇలా బార్లీ గింజల నీళ్లను తాగితే అనేక లాభాలను పొందవచ్చు. బార్లీ గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. దీంతో రోజూ సుఖ విరేచనం అవుతుంది.
బార్లీ గింజల నీళ్లను తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఈ నీళ్లను రోజూ తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు పోతాయి. దీంతో శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవచ్చు. బార్లీ గింజల నీళ్లను సేవిస్తుంటే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గి మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. ఫలితంగా హార్ట్ ఎటాక్ రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే ఈ నీళ్లను సేవిస్తుండడం వల్ల షుగర్ లెవల్స్‌ను కూడా తగ్గించుకోవచ్చు. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి బార్లీ నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. రోజూ తాగితే ఎంతగానో ఫలితం ఉంటుంది.
అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారికి బార్లీ నీళ్లు ఒక వరం అనే చెప్పవచ్చు. ఈ నీటిని సేవించడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారికి కూడా బార్లీ నీళ్లు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. ఈ నీళ్లను రోజూ సేవిస్తుంటే కిడ్నీల్లోని రాళ్లు కరిగిపోతాయి. డీహైడ్రేషన్ సమస్యకు బార్లీ గింజల నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. శరీరంలో ద్రవాలు ఎక్కువగా లేక తరచూ డీహైడ్రేషన్ బారిన పడేవారు రోజూ ఉదయం బార్లీ నీళ్లను తాగితే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. ఇలా బార్లీ గింజల నీళ్లను రోజూ తాగడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కనుక ఈ నీళ్లను రోజూ సేవించడం మరిచిపోకండి.