వెదురుతో అనేక ఉపయోగాలు. వివిధ వస్తువుల తయారీలో వెదురు బొంగులు వాడతారు. వెదురు బియ్యమూ తింటారు. ఎన్నో ఔషధ గుణాలున్న వెదురు మసాజ్ థెరపీలోనూ భాగమైంది. నాడీ సంబంధ వ్యాధుల నివారణకు వెదురు మర్దనా మంచి పరిష్కారమని అంటారు.
ఈ చికిత్సలో భాగంగా.. తైల మర్దన తర్వాత, వేడిచేసిన వెదురు కర్రలను ఒంటిపై సుతారంగా రుద్దుతారు. ఇలా చేయడం వల్ల నాడీ కణాలు ప్రేరేపితం అవుతాయని, రక్త ప్రసరణ మెరుగవుతుందనీ సంప్రదాయ వైద్యగ్రంథాలు వివరిస్తాయి.
ఒత్తిడి, అలసట నుంచి ఉపశమనమూ లభిస్తుంది. నిద్రలేమి సమస్యకు ఉత్తమ పరిష్కారంగా కూడా చెబుతారు. చికిత్స స్వభావాన్ని బట్టి, రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి వెదురుబొంగు పరిమాణం మారుతుంది. ఇంట్లోనే ప్రయత్నించాలని అనుకునేవారికి అమెజాన్ లాంటి ఆన్లైన్ దుకాణాల్లో కిట్స్ దొరుకుతాయి.