మాకు ఆరు వారాల క్రితం పాప పుట్టింది. పుట్టినప్పుడు చిన్నారి బరువు మూడు కిలోలు. కామెర్ల (జాండిస్) సమస్య వచ్చింది. ఫొటో థెరపీ పెట్టమన్నారు. లైట్ ట్రీట్మెంట్ ఇస్తే కొంత తగ్గింది. మూడు వారాల తర్వాత కూడా జాండిస్ పూర్తిగా తగ్గలేదు. అదే సమయంలో మోషన్ (మలం) కూడా సాధారణంగా పసుపు పచ్చగా కాకుండా తెల్లగా, సుద్దలాగా వచ్చేది. దీంతో పీడియాట్రీషియన్‌ను సంప్రదిస్తే.. స్కాన్ చేయించారు. సాధారణ కామెర్లు కాదు, డైరెక్ట్ జాండిస్ అని చెప్పారు. ఆపరేషన్ అవసరం అంటున్నారు. నవజాత శిశువులకు జాండిస్ సహజమే కదా.. అందరికీ మందులతోనే తగ్గిపోతుందని అంటారు. జాండిస్‌కు ఆపరేషన్ చేస్తారని ఎప్పుడూ వినలేదు. దయచేసి సలహా ఇవ్వండి.
– ఓ పాఠకురాలు
మీరు చెప్పిన వివరాల ప్రకారం చూస్తే.. మీ బిడ్డకు పుట్టుకతోనే లివర్ (కాలేయం)లో ఇబ్బందిగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమై వచ్చే రంగు పదార్థమే జాండిస్ అంటాం. ఇది కాలేయంలో ఉత్పన్నం అవుతుంది. ఈ పదార్థాన్ని ‘బిలిరుబిన్’ అని పిలుస్తాం. అది బైల్ (పైత్య రసం)లో కలిసి పైత్యరస నాళం ద్వారా పేగుల్లోకి స్రవించబడుతుంది. అది ప్రయాణించే మార్గం ఏదైనా కారణంగా మూసుకుపోయి పైత్య రస నాళం సరిగ్గా ఏర్పడకపోతే బిడ్డకు ఇలాంటి సమస్య వస్తుంది. ఎప్పుడైతే చేదు (పైత్యరసం) పేగుల్లోకి రావట్లేదో అప్పుడు మలం సాధారణ రంగును కోల్పోతుంది.
తెల్లగానో, చాక్‌పీస్ రంగులోనో, క్రీమ్ కలర్లోనో ఉండే మలం సీరియస్ జాండిస్‌కు సంకేతం. ఇది ‘బిలియరీ అట్రేసియా’ అనే కండిషన్ అయి ఉండవచ్చు. దీనికి ఎంత త్వరగా ఆపరేషన్ చేస్తే అంత మంచిది. అంతేకాకుండా ‘కొలిడోకల్ సిస్ట్’ కూడా కావొచ్చు. ఈ సమస్య ఉంటే సిస్ట్ (తిత్తి)లాగా ఏర్పడి బిలిరుబిన్ (ఎర్ర రక్త కణాల విచ్ఛిన్నంతో ఉత్పన్నమయ్యే రంగు పదార్థం)కు అడ్డుపడుతుంది. ఇది కూడా ప్రమాదకరమే. ఏదేమైనా ఈ రెండు సమస్యలకూ ఆపరేషన్ తప్పనిసరి.
డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్