Ayushmann Khurrana and Vertigo | టెలివిజన్ వ్యాఖ్యాతగా కెరీర్‌ను ప్రారంభించిన ఆయుష్మాన్ ఖురానా .. వికీ డోనార్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. ఈయన నటించిన ఎన్నో సినిమాలు కమర్షియల్ హిట్‌గా నిలిచి విమర్శకులు ప్రశంసలు అందుకున్నాయి. డాక్టర్ జీ, గులాబో సితాబో, బాలా, బధాయి హో వంటి సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఆయుష్మాన్ ఖురానా.. తాను ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యపై తొలిసారి నోరు విప్పారు.
వెర్టిగో సమస్యతో బాధపడుతున్నట్లు ఇటీవలి ఓ కాంక్లేవ్ సందర్భంగా వెల్లడించి అందర్నీ ఆశ్చర్యపరిచారు ఆయుష్మాన్ ఖురానా. సినిమాల్లోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సందర్భాల్లో ఈ సమస్య తనను ఎంతగా ఆందోళనకు గురిచేసేందో చెప్తూ కన్నీటి పర్యంతమయ్యాడు. ‘ఆరేండ్ల క్రితం నుంచి వెర్టిగో సమస్యతో బాధపడుతున్నాను. రానున్న సినిమాలో ఎత్తైన భవనం నుంచి దూకాలనే సీన్ ఉంటుంది. రక్షణకు హార్నెస్ కేబుల్స్ ఉన్నప్పటికీ ఏదో జరుగుతుందని భయపడిపోయాను. ఆ బాధ నరాలు తెగిపోయేలా చేసింది..’ అని చెప్పుకొచ్చారాయన. విపరీతమైన తల తిరుగుడు కారణంగా చాలా సన్నివేశాల చిత్రీకరణను నిలిపివేయాల్సి వచ్చిందని చెప్పిన ఆయన.. ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని ప్రత్యేక వ్యాయామాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
అసలేమిటీ వెర్టిగో..
బినైన్ ప్యారోక్సిస్మల్ పొజిషనల్ వెర్టిగో (బీపీపీవీ), ఇన్ఫెక్షన్, మెనియెర్స్ డిసీజ్, మైగ్రేన్ కారణంగా వెర్టిగో వస్తుంటుంది. బీపీపీవీ వల్ల తాము తిరిగిపోతున్నట్లుగా ఫీలవుతారు. ఈ ఫీలింగ్ కొద్దిసేపే ఉన్నా చాలా ఇంటెన్సీవ్‌గా ఉంటుంది. వెస్టిబ్యులార్ నర్వ్లో ఉండే వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఇన్ఫెక్షన్ వెర్టిగో వస్తుంది. చెవి లోపలి భాగంలో ఫ్లూయిడ్ బిల్డప్ అయితే గంటలపాటు వెర్టిగో సడెన్‌గా వస్తుంది. మైగ్రేన్ కారణంగా కూడా కొన్ని నిమిషాల నుంచి గంటల వరకు వెర్టిగో ఉంటుంది.
లక్షణాలివీ..
డిజీనెస్, పరిసరాలు తిరుగుతున్న ఫీలింగ్, బ్యాలెన్స్ కోల్పోవడం, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. చెవుల్లో రింగ్ మనే శబ్దాలు వినిపిస్తాయి. చెమట ఎక్కువ పడుతుంది. అస్థిరత కోల్పోతుంటాం. ఒత్తిడి వల్ల వెర్టిగో రాదు కానీ, వెర్టిగో ఉంటే ఈ సమస్యను ఒత్తిడి మరింత ఎక్కువ చేస్తుంది. ఒత్తిడి ఎక్కువైతే స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
పరిష్కారమిలా..
‘మొదట్లో మందులకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఎందుకంటే మంచం పైనుంచి లేవగానే తల తిప్పడం మొదలవుతుంది. ముఖ్యంగా నాలాంటి వృత్తిలో ఉన్నవాళ్లు ఎత్తైన భవనం పైనుంచి దూకడం, ఫైట్స్ వంటి విన్యాసాలు చేయాల్సి ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు నాకు ధ్యానం గొప్పగా సహాయపడింది’ అని ఆయుష్మాన్ ఖురానా తెలిపాడు. ప్రశాంతంగా ఉండటం ద్వారా ఈ సమస్య నుంచి త్వరగా బయటపడొచ్చునంటున్నాడాయన. అంతర్గతంగా ఉండే మన శక్తే ఈ సమస్య నుంచి మనల్ని కాపాడాతుంది అని చెప్పాడు ఆయష్మాన్ ఖురానా.
వెస్టిబ్యులార్ రీహాబిలిటేషన్ థెరపీలో వాడే ఎక్సర్సైజులు చేయడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. తల కొద్దిగా ఎత్తుగా పెట్టుకుని పడుకోవాలి. నేలపై ఉన్న వస్తువులను వంగి తీయడం మానుకోవాలి. మెడను ముందుకు చాపకూడదు. నిత్యం చేసే పనుల్లో ఉన్నప్పుడు స్పీడ్‌గా తల తిప్పకుండా చూసుకోవాలి.