న్యూఢిల్లీ: ఇప్పటికే కరోనా పేషెంట్లను బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్‌లు భయపెడుతున్నాయి. ఇలాంటి సమయంలో గుజరాత్‌లోని వడోదర డాక్టర్లు మరో బ్యాడ్‌న్యూస్ చెప్పారు. 8 మంది కొవిడ్ పేషెంట్లలో కొత్త ఫంగల్ ఇన్ఫెక్షన్ అయిన ఆస్పర్గిలోసిస్ను గుర్తించినట్లు వాళ్లు తెలిపారు. అటు ముంబై, ఘజియాబాద్‌లలో కూడా ఈ కేసులు నమోదైనట్లు అక్కడి డాక్టర్లు చెప్పారు. కొవిడ్ పాజిటివ్‌గా తేలి, కోలుకున్న పేషెంట్లలో ఈ కొత్త ఇన్ఫెక్షన్ కనిపిస్తుట్లు వాళ్లు చెబుతున్నారు.
ఏంటీ ఆస్పర్‌గిలోసిస్?
ఇది ఆస్పర్గిలస్ అనే ఓ సాధారణ ఆకుపచ్చని బూజు ద్వారా వస్తుంది. కుళ్లిపోయిన మొక్కలు, ఆకులపై ఈ ఫంగస్ కనిపిస్తుంది. మనం ప్రతి రోజూ గాలి ద్వారా వీటిని పీల్చుకుంటూనే ఉంటాం. అయితే ఇది సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో బాధపడేవారికి ఇది త్వరగా సోకే ప్రమాదం ఉంటుంది. ఈ రెండూ కొవిడ్ పేషెంట్లలో సాధారణంగా కనిపించేవే. దీంతో ఆ వైరస్ బారిన పడి కోలుకున్న వారికి ఇది సోకుతోంది.
ఆస్పర్‌గిలోసిస్ అంటువ్యాధా?
ఆస్పర్‌గిలోసిస్ ఓ మనిషి నుంచి మరో మనిషికి, జంతువుల నుంచి మనుషులకు సోకదని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) స్పష్టం చేసింది. అయితే ఈ ఫంగస్‌లో వివిధ రకాలు ఉంటాయని, అందులో కొన్ని సాధారణమైనవి కాగా మరికొన్ని మాత్రం చాలా ప్రమాదకరమైనవని సీడీసీ చెబుతోంది.
ఎవరికి ముప్పు ఎక్కువ?
సీడీసీ ప్రకారం ఒక్కో రకం ఆస్పర్‌గిలోసిస్ ఫంగస్ ఒక్కొక్కరికి ప్రమాదకరం. ఇప్పటికే ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వారికి ఇది తరచూ సోకుతూ ఉంటుంది. ఆస్తమా లేదా సిస్టిక్ ఫిబ్రోసిస్ ఉన్న వారికి అలెర్జిక్ బ్రోంకోపల్మనరీ ఆస్పర్‌గిలోసిస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇక టీబీ, క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ) ఉన్న వారికి క్రోనిక్ పల్మనరీ ఆస్పర్‌గిలోసిస్ సోకుతుంది. ఇక రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై ఇన్వేసివ్ ఆస్పర్‌గిలోసిస్ ఎక్కువ ప్రభావం చూపుతుంది.
దీని లక్షణాలు ఏంటి?
ఒక్కో ఆస్పర్‌గిలోసిస్ లక్షణాలు ఒక్కో రకంగా ఉంటాయి. బ్రోంకోపల్మనరీ ఆస్పర్‌గిలోసిస్ లక్షణాలు ఆస్తమాలాగే కనిపిస్తాయి. అంటే శ్వాస తీసుకునేటప్పుడు ఒకరకమైన శబ్దం రావడం, శ్వాస సరిగా ఆడకపోవడం, దగ్గు, జ్వరం ఉంటాయి. ఇక అలెర్జిక్ ఆస్పర్గిలోసిస్లో ముక్కు కారడం, తలనొప్పి, వాసన మందగించడం, ముక్కు దిబ్బడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. క్రోనిక్ పల్మనరీ ఆస్పర్‌గిలోసిస్ సోకిన వారిలో బరువు తగ్గడం, దగ్గు, రక్తంతో కూడిన దగ్గు, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలుతుగాయి. ఇన్వేసివ్ ఆస్పర్గిలోసిస్లో జ్వరం, ఛాతీ నొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడం ఇబ్బందులతోపాటు అది ఊపిరితిత్తులతోపాటు ఇతర శరీర భాగాలకు వ్యాపిస్తే కొన్ని ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి.
ఎలా రక్షించుకోవాలి?
దుమ్ము, దూళి ముక్కు, నోటి ద్వారా ఒంట్లోకి వెళ్లకుండా చూసుకోవాలి. కచ్చితంగా ఎన్95 మాస్కులు ధరించాలి. రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవాళ్లు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. వీళ్లకు ఇన్వేసివ్ ఆస్పర్‌గిలోసిస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాళ్లు ముందు జాగ్రత్తగా రక్త పరీక్షల ద్వారా దీనిని గుర్తించి తగిన మందులు వాడాలి.