Arthritis Symptoms | వయసుపై బడడం వల్ల తలెత్తే అనారోగ్య సమస్యల్లో ఆర్థరైటిస్ ప్రధాన సమస్య అని చెప్పవచ్చు. ఈ సమస్యతో బాధపడే వారిని ప్రస్తుత కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్లను అతిగా వాడడం, గాయాలు, అంతర్లీన వాపులు, జన్యుపరమైన కారణాల వల్ల ఈ సమస్య ఎక్కువగా తలెత్తుతుంది. వృద్దాప్యంలో ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికి 20 నుండి 30 ఏళ్ల వయసులో కూడా దీని లక్షణాలు మనకు కనిపిస్తాయి. కానీ దీనిని మనం పట్టించుకోకపోవడం వల్ల, తగిన చికిత్స ముందుగానే తీసుకోకపోవడం వల్ల సమస్య తీవ్రత పెరుగుతుంది. యుక్తవయసులోనే ఆర్థరైటిస్ లక్షణాలను గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక కీళ్ల నష్టాన్ని నివారించవచ్చు. 20 నుండి 30 ఏళ్ల వయసులో కనిపించే ఆర్థరైటిస్ లక్షణాల గురించి వైద్యులు వివరిస్తున్నారు.
కొద్దిసేపు కూర్చున్న తరువాత లేదా ఉదయం నిద్ర లేచిన తరువాత కీళ్లు విపరీతంగా నొప్పి ఉంటే దానిని ముందస్తు హెచ్చరికగా భావించవచ్చు. ఆర్థరైటిస్ సంబంధిత నొప్పులు విశ్రాంతి తీసుకున్న తరువాత కూడా ఎక్కువగా ఉంటాయి. కనుక ఇటువంటి నొప్పులను గమనించిన వెంటనే జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. నిద్రలేచిన అరగంట తరువాత కూడా చేతులు, మోకాళ్లు, మణికట్టు వంటివి మొద్దుబారినట్టుగా, గట్టిగా అవుతాయి. ఇవి రోజువారీ పనులకు ఆటంకాలను కలిగిస్తాయి. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్ వంటి తీవ్రమైన సమస్య కూడా కావచ్చు. కనుక దీనిని నిర్లక్ష్యం చేయకూడదు. కీళ్లల్లో వాపు వంటివి వాటిని కూడా విస్మరించకూడదు. ఇది సాధారణమైనదే అయినప్పటికీ కొన్నిసార్లు ఈ వాపు ఆర్థరైటిస్ ప్రారంభదశను సూచిస్తుందని చెప్పవచ్చు. ఈ వాపు కాలక్రమేణా ఉండవచ్చు లేదా తగ్గవచ్చు.
తగినంత విశ్రాంతి తీసుకున్నప్పటికీ తీవ్రమైన అలసటగా అనిపిస్తుంది. ఇది ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్ ప్రారంభ సంకేతాల్లో ఒకటి కావచ్చు. రోగనిరోధక శక్తి చురుకుగా ఉండి కీళ్లపై దాడి చేస్తాయి, వాపుకు దారితీస్తాయి. శక్తిని తగ్గిస్తాయి. కనుక అలసటగా అనిపించిన వెంటనే వైద్యున్ని సంప్రదించడం చాలా అవసరం. కీళ్లు బిగుతుగా మారడంతో పాటు మెడను కదిలించడం, మోకాళ్లను వంచడం, వేళ్లను వంచడం వంటివి కూడా కష్టతరంగా మారతాయి. కీళ్ల కదలికలు తగ్గడంతో పాటు కదిలించడం కష్టంగా ఉంటుంది. ఇది ప్రారంభ దశలో ఉండే ఆర్థరైటిస్ ను సూచిస్తుంది. కీళ్ల ఉపరితలం కింద వాపు వల్ల కీళ్లల్లో వేడిగా ఉండడం, కీళ్ల దగ్గర ఎర్రగా ఉండడం వంటివి జరుగుతాయి. ఎటువంటి గాయం లేకుండా ఇలా ఒకే ప్రాంతం దగ్గర కీళ్లు ఎర్రగా, వేడిగా అనిపించడం కూడా ఆర్థరైటిస్ లక్షణాల్లో ఒకటి.
ముఖ్యంగా చేతులు లేదా వేళ్లల్లో తిమ్మిరిగా ఉండడం, సూదులతో గుచ్చినట్టుగా ఉండడం వంటి భావన కూడా ఆర్థరైటిస్ లక్షణం అని చెప్పవచ్చు. కీళ్లల్లో వచ్చే వాపు నరాలపై ఒత్తిడిని కలిగించడం వల్ల చేతుల్లో తిమ్మిరిగా ఉంటుంది. వ్యాయామం చేసిన తరువాత నొప్పి సాధారణమే అయినప్పటికీ విశ్రాంతి తీసుకున్న తరువాత కూడా కీళ్ల నొప్పులు తగ్గకుండా దీర్ఘకాలం పాటు ఉండడాన్ని ఆర్థరైటిస్ లక్షణంగా భావించవచ్చు. శారీరకంగా చురుకుగా ఉండే యువకులు, ఆటలు ఆడేవారిలో నొప్పులు ఉన్నప్పటికీ ఈ నొప్పులు తరచూ రావడం, తగ్గకుండా ఉండడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు.
కీళ్లను కదిలించినప్పుడు కీళ్లల్లో గ్రైండింగ్ లేదా పాపింగ్ లేదా క్లిక్కింగ్ వంటి శబ్దాలు వస్తూ ఉంటాయి. ఈ శబ్దాలు రావడం యువకుల్లో మృదులాస్థి విచ్చినం అవ్వడం లేదా ఆస్టియో ఆర్థరైటిస్ ప్రారంభ సంకేతాలను సూచిస్తాయి. కనుక శబ్దాలను గమనించిన వెంటనే తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. కుటుంబంలో ఎవరైనా ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడుతూ ఉంటే జాగ్రత్తగా ఉండడం మంచిది. జన్యుపరంగా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. కనుక లక్షణాలను గుర్తించిన వెంటనే జాగ్రత పడడం మంచిది. యుక్త వయసులోనే ఆర్థరైటిస్ లక్షణాలను, సమస్య తీవ్రతను గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం చాలా మంచిది. వీటిని నిర్లక్ష్యంచేయడం వల్ల ఈ నొప్పులే భవిష్యత్తుల్లో తీవ్రంగా మారి మరింత ఇబ్బందిని కలిగిస్తాయి.