Blue Java Bananas | సోషల్ మీడియాలో వస్తున్న ఫొటోలు లేదా వీడియోల్లో అసలు నిజం ఎంత ఉంది.. అన్న విషయం ఎవరికీ తెలియడం లేదు. చాలా మంది ఫేక్ ఫొటోలు, వీడియోలను కూడా నిజమే అని నమ్మి బోల్తా పడుతున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు సైతం ఫేక్ ఫొటోలు, వీడియోలు, అసలు వాటికి తేడా గుర్తించలేకపోతున్నాయి. అయితే అలా ఈ మధ్య కాలంలో వైరల్ అయిన చాలా ఫొటోల్లో నీలి రంగు అరటి పండ్ల ఫొటో కూడా ఒకటి. ఈ అరటి పండ్లను బ్లూ జావా అరటి పండ్లని అంటారని, ఈ రంగులో ఉన్న పండ్లను తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చాలా మంది సోషల్ మీడియాలో నీలి రంగులో ఉన్న అరటి పండ్ల ఫొటోలను షేర్ చేస్తున్నారు. అయితే ఫ్యాక్ట్ చెక్ సంస్థలు చెబుతున్న ప్రకారం ఆ ఫొటోలు నిజమైనవి కావని, అవి మార్ఫింగ్ చేయబడ్డాయని తేలింది.
నీలి రంగు అరటి పండ్లు ఉన్నాయి. కానీ అవి మరీ అంత నీలి రంగులో ఉండవు. ఆకుపచ్చ రంగుపై కాస్త నీలి రంగు కోటింగ్ వేస్తే ఎలా ఉంటుందో ఆ పండ్లు అలా ఉంటాయి. ఇక ఆ పండ్లు పండే కొద్దీ మీద తొక్క పసుపు రంగులోకి మారుతుంది. సాధారణ అరటి పండ్లలాగే ఆ తొక్క కూడా పసుపు రంగులో ఉంటుంది. కానీ లోపల గుజ్జు మాత్రం ఐస్ క్రీమ్‌లా చాలా మెత్తగా మారుతుంది. దీంతో బ్లూ జావా అరటి పండ్లనే ఐస్ క్రీమ్ అరటి పండ్లు అని కూడా పిలుస్తారు. సాధారణ అరటి పండ్లతో పోలిస్తే వీటి గుజ్జు చాలా మెత్తగా ఉంటుంది. ఐస్ క్రీమ్ ఫ్లేవర్‌ను కలిగి ఉంటుంది. కనుకనే ఈ అరటి పండ్లను ఐస్ క్రీమ్ బనానాస్ అని కూడా పిలుస్తారు. అంతేకానీ ఈ పండ్ల తొక్క లేదా లోపలి గుజ్జు చిత్రాల్లో చూపించినట్లు నిజంగానే నీలి రంగులో ఉండదు. కొందరు యూజర్లు నెటిజన్లను తప్పుదోవ పట్టించేందుకే సాధారణ అరటి పండ్లను ఫోటోషాప్ చేసి అలా నెట్లో వైరల్ చేశారని ఫ్యాక్ట్ చెక్ సంస్థలు తేల్చాయి.
ఇక బ్లూ జావా అరటి పండ్లు కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పండుతాయి. ఆగ్నేయ ఆసియా ప్రాంతంతోపాటు హవాయి దీవుల్లో బ్లూ జావా అరటి పండ్లను బాగా పండిస్తారు. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్లలోనూ ఈ అరటి పండ్లను ఎక్కువగా సాగు చేస్తారు. వీటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది. వీటి ఐస్ క్రీమ్ ఫ్లేవర్ కారణంగా చాలా మంది ఈ పండ్లను ఇష్టంగా తింటారు. ఈ పండ్లు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. బ్లూ జావా అరటి పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. బీపీని తగ్గిస్తుంది. హైబీపీ ఉన్నవారు ఈ పండ్లను రోజూ తింటే బీపీని అదుపులో ఉంచుకోవచ్చు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఈ అరటి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని సంరక్షిస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. చర్మం కాంతివంతంగా మారి మృదువుగా కూడా ఉంటుంది. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ఈ పండ్లలో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. ఇది రక్తం తయారయ్యేలా చేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. మూడ్‌ను మారుస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. మానసిక ప్రశాంతత లభించేలా చేస్తుంది. విటమిన్ బి6 వల్ల మెదడు యాక్టివ్‌గా మారి ఆరోగ్యంగా ఉంటుంది. గర్భిణీలు ఈ పండ్లను తింటే వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా బ్లూ జావా అరటి పండ్లను తింటే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కానీ సామాజిక మాధ్యమాల్లో షేర్ అవుతున్న ఫొటోల మాదిరిగా ఇవి అచ్చం నీలి రంగులో ఉంటాయని భ్రమ పడకండి.