‘యాన్ ఆపిల్ ఎ డే… కీప్స్ డాక్టర్ ఎవే’ అన్నది ఆంగ్ల సామెత. రోజూ ఒక ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు అని దీని అర్థం. ఇది ఎంత వరకూ నిజం అన్నది పోషకాహార నిపుణులే తేల్చి చెప్పాల్సిన విషయం. మరి వాళ్లేమంటున్నారో… ఆ సంగతేంటో మనమూ చూద్దామా!
విటమిన్ సి మన రోగనిరోధక వ్యవస్థకు, కొలాజెన్ ఉత్పత్తికి ప్రధానమైన పోషకం. అది ఆపిల్ పండ్లలో పుష్కలంగా దొరుకుతుంది. రక్త ప్రసరణను నియంత్రించి, హృదయ ఆరోగ్యానికి సహకరించే పొటాషియం ఇందులో దండిగా ఉంటుంది. పండులోని పీచులు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. ఆపిల్ తింటే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇది బరువు నియంత్రణకు సహకరిస్తుంది. ఈ పండులో ఉండే క్వెర్సటైన్ లాంటి యాంటి ఆక్సిడెంట్లు గుండె జబ్బుల్ని, మధుమేహాన్ని, కొన్ని రకాల క్యాన్సర్లను నివారించేందుకు తోడ్పడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ను నివారించి ఆస్థమా, సైనసైటిస్లాంటి శ్వాస కోశ సంబంధ వ్యాధుల నియంత్రణకూ పనికొస్తాయి.
శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రించి ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మెదడును కాపాడుకునేందుకూ ఆపిల్ పండు ఎంతగానో సాయపడుతుంది. పెక్టిన్ అనే ఒక రకం ఫైబర్ మలబద్ధకాన్ని నివారించేందుకు, ఎల్‌డీఎల్‌గా పిలిచే రక్తంలోని చెడు కొవ్వులను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఇందులోని ఇనుము, విటమిన్-సి ఒంట్లో సరిపడినంత రక్తం ఉండేలా చేస్తాయి. మనం సేపు పండుగా పిలిచే ఈ ఆపిల్ ఇన్ని రకాలుగా శరీరానికి మేలు చేస్తుందన్నమాట. కాబట్టి తాజాగా ఉండేలా చూసుకుని ఈ పండ్లను తింటూ, కాస్త ఆరోగ్యాన్ని కాపాడుకుంటే డాక్టర్‌తో అవసరమే రాదని అర్థమన్నమాట!