మా బాబుకు ఆరేండ్లు. వారం కిందట జ్వరం వచ్చింది. పీడియాట్రీషియన్‌కు చూపించి, మందులు వాడాం. తర్వాత కూడా అడపాదడపా కడుపు నొప్పి అంటున్నాడు. డాక్టర్ ఇచ్చిన మందులు వేస్తే నొప్పి తగ్గుతున్నది. అయితే, మూడు రోజులుగా బాబుకు కడుపునొప్పి అధికమైంది. జ్వరంతో బాధపడుతున్నాడు. ఆకలి కూడా పూర్తిగా మందగించింది. వెంటనే పిల్లల డాక్టర్‌ను కలిశాం. వాళ్లు రక్త పరీక్ష, స్కాన్ చేశారు. తర్వాత అపెండిసైటిస్ ఉన్నదేమో అని అనుమానం వ్యక్తం చేశారు. చిన్నపిల్లలకు కూడా అపెండిసైటిస్ వస్తుందా? దీని పరిష్కారానికి శస్త్రచికిత్స ఒకటే మార్గమా? తెలియజేయండి..
ఓ పాఠకురాలు
చిన్నపిల్లలకు కూడా అపెండిసైటిస్ రావొచ్చు. మీ బాబు లక్షణాలు, వైద్య పరీక్షల ఆధారంగా దీనిని నిర్ధారించాల్సి ఉంటుంది. జ్వరం రావడం, ఆకలి మందగించడం, పొట్టలో నొప్పి ఇవన్నీ కొంచెం అనుమానించదగ్గ లక్షణాలే! సాధారణంగా అల్ట్రా సౌండ్ స్కానింగ్‌లో అపెండిసైటిస్ ఎలా ఉందని తెలుసుకోవాలి. అంటే ఎంత పొడవుగా ఉంది, ఎంత వాపు ఉంది ఇలా కొన్ని అంశాల ఆధారంగా అపెండిక్స్ ఇన్ఫెక్ట్ అయ్యిందో లేదో నిర్ధారించాల్సి ఉంటుంది. రక్తపరీక్ష కూడా చేస్తారు.
ఇన్ఫెక్షన్కు సంబంధించి ప్రొటీన్ ఎక్కువగా ఉండటం, తెల్ల రక్తకణాలు పెరిగిపోవడం గమనిస్తే.. అపెండిక్స్ సమస్య ఉందని అంచనాకు రావొచ్చు. బాబు లక్షణాలు, రక్తపరీక్ష ఫలితాల్లో మార్పులు, స్కానింగ్ రిపోర్టు అన్నిటినీ బేరీజు వేసు కొని నిర్ధారణకు రావాలి. అపెండిక్స్ ఉందని వైద్యుడు నిర్ణయానికి వచ్చి.. ఆపరేషన్ చేయాలని సూచిస్తే.. శస్త్రచికిత్స చేయించడమే మంచిది. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ తక్కువగా ఉండి, బిడ్డ యాక్టివ్‌గా ఉన్నట్లయితే యాంటి బయోటిక్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. మొత్తానికి వైద్యుడి సలహా మేరకు నడుచుకోవడం మంచిది. వారి సూచన ప్రకారం చికిత్స చేయించండి.
– డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్