మా బాబుకు మూడేండ్లు. యాక్టివ్గా ఉంటాడు. అల్లరి ఎక్కువే! బాగా చీదర కూడా చేస్తుంటాడు. మట్టి తింటున్నాడు. పైగా కింద పడిన పదార్థాలు కూడా తింటుంటాడు. భోజనం చేయడు. ఇప్పటికీ పాలు తాగుతాడు. ఎంత ప్రయత్నించినా పాలు మానడం లేదు. రోజుకు ఆరుసార్లు బాటిల్ పాలు తాగుతాడు! అన్నిటికన్నా ముఖ్యంగా మట్టి తినడం ఏదైనా ప్రమాదమా? సలహా ఇవ్వగలరు?
మీ అబ్బాయికి మూడేండ్లు అని చెబుతున్నారు. ఇంకా పాలు తాగుతున్నాడని అంటున్నారు. బిడ్డకు మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తర్వాతి ఆరు నెలలు క్రమంగా తల్లిపాలు తగ్గిస్తూ ఘన పదార్థాలు ఇవ్వాలి. రెండేండ్ల వయసు వచ్చే దాకా పిల్లలకు తల్లిపాలు ఇవ్వొచ్చు. అదనంగా 250 మిల్లీలీటర్ల కన్నా ఎక్కువగా పాలు ఇవ్వకూడదు. పాలు అధిక మోతాదులో తీసుకోవడం వల్ల బిడ్డకు ఆకలి వేయదు. ఫలితంగా ఆహారం తీసుకోడు. దీంతో బిడ్డ ఎదుగుదలకు అవసరమయ్యే విటమిన్లు, ఐరన్ లాంటి పోషకాలు లభ్యం కావు. బిడ్డకు పోషకాల నూన్యత ఏర్పడుతుంది. మీ బిడ్డ విషయంలో మట్టి తినడం, కిందపడిన పదార్థాలు తినడం చేస్తున్నారని చెప్పారు.
దీనిని పైకా అంటారు. ‘ఐరన్ డెఫిషియెన్సీ- ఎనీమియా’ ఉన్న పిల్లల్లో ఈ తరహా లక్షణాలు కనిపిస్తాయి. ఐరన్ లోపం వల్ల ఈ తరహా ప్రవర్తన కలుగుతుంది. మీ బిడ్డ విషయంలో ఎనీమియా ఉన్నదని నా అనుమానం. వెంటనే పీడియాట్రీషియన్ని సంప్రదించండి. అదేవిధంగా పాలు ఎక్కువగా తాగడం వల్ల మలబద్ధకం సమస్య కూడా తలెత్తుతుంది. మీరు మీ బిడ్డకు ఇచ్చే పాలు తక్షణం గణనీయంగా తగ్గించాల్సి ఉంటుంది. అంటే పాల పరిమాణం రోజుకు 250 మిల్లీలీటర్లకు మించకుండా చూసుకోండి. ఉదయం, సాయంత్రం చిన్నగ్లాసెడు చొప్పున పాలు ఇవ్వండి. దీంతోపాటు పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు ఇవ్వండి. అన్నం, కూరగాయలు, పెరుగు, మాంసాహారులైతే మటన్, చికెన్, గుడ్డు తదితర పదార్థాలు తగిన మోతాదులో బిడ్డకు అందివ్వండి. ఐరన్ పెరగడానికి వైద్యులు సిరప్ కూడా ఇస్తారు. అంతేకాకుండా ఐరన్ సమృద్ధిగా లభించే కాయగూరలు తినాలి. మాంసాహారులైతే మటన్, లివర్ లాంటివి పిల్లలకు పెట్టాలి. అలాగే హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించండి. వైద్యుడి సలహా మేరకు ముందుకువెళ్లండి.