Anti Ageing Foods | సినిమా తారలను చూస్తే ఎల్లప్పుడూ వారు యంగ్‌గానే కనిపిస్తారు. 50 సంవత్సరాల వయస్సులోనూ యవ్వనంగానే కనిపిస్తారు. అయితే వారు అలా కనిపించేందుకు ఎంతో కష్టపడతారన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు. వారు సినిమాల్లో నటించాలి కనుక యంగ్‌గా ఉంటేనే బాగుంటుంది. కనుక ఆ ఫిజిక్‌ను మెయింటెయిన్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తుంటారు. వ్యాయామం చేయడంతోపాటు స్ట్రిక్ట్ డైట్‌ను కూడా పాటిస్తుంటారు. అయితే మన శరీరాన్ని యవ్వనంగా ఉంచడంలో ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. మనం తీసుకునే ఆహారాలే మన శరీనాన్ని యవ్వనంగా ఉంచుతాయి. అనారోగ్యాల బారిన పడకుండా చూస్తాయి. ఈ క్రమంలోనే నిత్యం పలు ఆహారాలను తినడం వల్ల ఎల్లప్పుడూ యంగ్‌గా ఉండేలా చూసుకోవచ్చు. దీంతో అందరి దృష్టి మీపైనే పడుతుంది. ఇక అందుకు ఏయే ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజూ 2 నుంచి 3 కప్పుల గ్రీన్ టీని సేవిస్తుండడం వల్ల ఎల్లప్పుడూ చర్మాన్ని యవ్వనంగా ఉంచుకోవచ్చు. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో పాలిఫినాల్స్ ఉంటాయి. ఇవి వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు పోయేలా చేస్తాయి. దీంతోపాటు తీవ్రమైన వ్యాధులు రాకుండా చూస్తాయి. కనుక గ్రీన్ టీని రోజూ తాగుతుంటే ఆరోగ్య ప్రయోజనాలు కలగడమే కాకుండా శరీరాన్ని ఎల్లప్పుడూ యవ్వనంగా ఉంచుకోవచ్చు. చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. అలాగే వారంలో కనీసం 2 నుంచి 3 సార్లు చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలి. సాల్మన్ వంటి చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు, సెలీనియం, ఆస్టాజాంతిన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన శరీరంలో కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేసేందుకు దోహదపడతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కనుక చేపలను తరచూ తింటుండాలి.
డార్క్ చాకొలెట్లను తినడం వల్ల కూడా చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా ఉంటుంది. వీటిల్లో ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల బారి నుంచి చర్మాన్ని సంరక్షిస్తాయి. దీంతో చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా రావు. అవిసె గింజలలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ గింజల్లో ఆల్ఫా-లినోలీనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మం పొరలను సంరక్షిస్తుంది. చర్మం ఎల్లప్పుడూ తేమగా ఉండేలా చేస్తుంది. దీంతో చర్మానికి సహజసిద్ధమైన నిగారింపు వస్తుంది. కనుక అవిసె గింజలను కూడా రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి.
చూసేందుకు ఎరుపు రంగులో దానిమ్మ పండ్లు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇవంటే చాలా మందికి ఇష్టమే. అయితే దానిమ్మ పండును రోజూ ఒకటి తింటున్నా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. దానిమ్మ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మానికి మరమ్మత్తులు చేస్తాయి. దీంతో చర్మ కణాలు పునరుత్తేజం చెందుతాయి. చర్మం యవ్వనంగా మారి కాంతివంతంగా కనిపిస్తుంది. రోజూ దానిమ్మ పండును తినడం ఇష్టం లేకపోతే దాని జ్యూస్‌ను అయినా తాగవచ్చు. దీంతో చర్మాన్ని యంగ్‌గా ఉంచుకోవచ్చు. అలాగే చెర్రీలను ఆహారంలో భాగం చేసుకున్నా కూడా చర్మం ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంటుంది. చెర్రీ పండ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తికి దోహదం చేస్తాయి. దీంతో చర్మం సురక్షితంగా ఉంటుంది. యవ్వనంగా కనిపిస్తుంది. ఇలా పలు రకాల ఆహారాలను తింటే చర్మాన్ని ఎల్లప్పుడూ యంగ్‌గా కనిపించేలా చేయవచ్చు.