‘మొన్న ఒక పోలీసు అధికారి… నిన్న ఓ ఆర్టీసీ ఉద్యోగి… అంతకుముందు ఓ డాక్టర్…’ ఇలా ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. అప్పటి వరకు ఎంతో చురుకుగా విధులు నిర్వర్తించిన వీళ్లు పనిచేస్తూనే ప్రాణాలు విడిచారు. అలుపెరగని గుండె అకస్మాత్తుగా ఆగిపోవడంతో 30-40 ఏళ్ల వయస్సులోనే మృత్యువాతపడ్డారు. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వచ్చే గుండె సమస్యలు డిజిటల్ యుగంలో వయసుతో సంబంధం లేకుండా యంగ్ గుండెల్లోనూ గుబులు రేపుతున్నాయి.
Heart Problems | ఆహారపు అలవాట్లు, మారిన జీవన శైలి, కుటుంబ నేపథ్యమే గుండె సమస్యలకు కారణమని ఇప్పటివరకు వైద్యులంతా అభిప్రాయపడ్డారు. కానీ చిన్న వయసులోనే ఎలాంటి లక్షణాలు లేకుండా అకస్మాత్తుగా కుప్పకూలిపోవడానికి గల కారణాలేంటి? కంటికి కనిపించని మన హృదయంలో జరిగే ఆ అలజడులేమిటి? ఎలాంటి హెచ్చరికలు లేకుండానే సడన్ కార్డియాక్ అరెస్ట్‌తో ఆగిపోతున్న యువ గుండెలను కాపాడుకోవడం ఎలాగో నేటి ‘ఊపిరి’లో తెలుసుకుందాం..
ఈ మధ్య జరుగుతున్న యుక్త వయసు మరణాలకు ప్రధాన కారణం సడన్ కార్డియాక్ అరెస్ట్ (ఎస్సీఏ). గుండెపోటు, కార్డియాక్ అరెస్టు అనేవి వేర్వేరు సమస్యలు. రక్తనాళాల్లో అవరోధాలు (బ్లాక్‌లు) ఏర్పడడం వల్ల గుండె పోటు వస్తుంది. గుండెలోపల విద్యుత్ ప్రసరణ నిలిచిపోయి గుండె కవాటాలు సంకోచ, వ్యాకోచాలు నిలిచిపోవడంతో కార్డియాక్ అరెస్ట్ ఏర్పడుతుంది. అంతేకాకుండా రక్తనాళాల్లో బ్లాక్‌లు ఏర్పడటం, విద్యుత్ ప్రసరణ నిలిచిపోవడం, పుట్టుకతో ఉన్న గుండె సమస్యలు కూడా ఈ కార్డియాక్ అరెస్ట్‌కు ప్రధాన కారణాలు. అయితే కార్డియాక్ అరెస్ట్‌కు గురైన రోగికి సకాలంలో చికిత్స అందించి ప్రాణాలు కాపాడవచ్చు.
సడన్ కార్డియాక్ డెత్ వేరు. సడన్ కార్డియాక్ అరెస్ట్ వేరు. సడన్ కార్డియాక్ డెత్‌లో రోగికి చికిత్స అందించే అవకాశం ఉండదు. సడన్ కార్డియాక్ డెత్‌లో గుండె సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా కారణమై ఉంటాయి. ఉదాహరణకు కార్డియాక్ అరెస్ట్‌తో పాటు బ్రెయిన్, కిడ్నీ, తదితర సమస్యలు తోడైతే రోగి హఠాన్మరణం చెందుతాడు. ప్రధానంగా జన్యు పరమైన గుండె జబ్బులు కూడా ఈ తరహా మరణాలకు కారణంగా చెప్పవచ్చు. వీరికి చికిత్స చేసే అవకాశం ఉండదు. అయితే కార్డియాక్ అరెస్ట్‌కు గురైన వారికి గోల్డెన్ అవర్‌లో చికిత్స అందించి ప్రాణాలు కాపాడవచ్చు.
35 ఏళ్లలోపు వారిలో సడెన్ కార్డియాక్ డెత్ చాలా అరుదుగా సంభవిస్తుంది. మహిళలతో పోల్చితే పురుషుల్లో ఈ తరహా మరణాలు సంభవించే అవకాశాలు అధికం. సడెన్ కార్డియాక్ డెత్ కేసుల్లో గుండె పనితీరు వేగవంతంగా పడిపోతుంది. శ్వాస, రక్త ప్రసరణ వెంటనే ఆగిపోతాయి. ఫలితంగా కొన్ని సెకన్ల వ్యవధిలోనే రోగి సృ్పహ కోల్పోయి మృత్యువాత పడతాడు. నిర్ధారణ చేయని జన్యుపరమైన గుండె జబ్బులే యువత ఆకస్మిక మరణానికి కారణం అవుతున్నాయి.
గుండెకు సంబంధించిన ఎలక్ట్రికల్ సిగ్నలింగ్‌లో ఏర్పడే లోపాలు, హెచ్చుతగ్గులు వంటి మార్పులతో యుక్త వయస్సులోనే ఈ సడన్ కార్డియాక్ డెత్ ఏర్పడుతుంది. అంతేకాకుండా అతి వేగవంతమైన హృదయ స్పందనతో గుండె పనితీరు అస్తవ్యస్తంగా మారుతుంది. దీంతో శరీరానికి రక్తాన్ని గుండె పంప్ చేయదు. ఈ విధమైన క్రమరహిత హృదయ స్పందనను ‘వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్’ అంటారు. గుండెకు ఒత్తిడి కలిగించే లేదా గుండె కణజాలాన్ని దెబ్బతీసే చర్య సమస్య వల్ల యువకుల్లో కార్డియాక్ అరెస్ట్ ఏర్పడి ఆకస్మిక గుండె మరణాలు సంభవించవచ్చు.
గుండె సమస్యలు ఉన్నట్లు నిర్ధారణ అయితే క్రీడాపోటీల్లో పాల్గొనొద్దు. తప్పనిసరిగా పాల్గొనాల్సి వస్తే వైద్యులను సంప్రదించాలి. వారి సూచన మేరకు గుండె సమస్యలకు మందులు వాడటంతోపాటు అవసరమైతే శస్త్రచికిత్స చేయించుకోవాలి. (ఉదాహరణకు ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్- డీఫిబ్రిలేటర్ ఐసీడీ అనే పరికరం ఛాతీలో ఉంచుతారు. ఈ పరికరం గుండె లయను నిరంతరం తనిఖీ చేస్తుంది. గుండె లయలో తీవ్రమైన మార్పు సంభవించినట్లయితే, ఈ పరికరం గుండెను రీసెట్ చేయడానికి విద్యుత్ షాక్‌లను అందిస్తుంది) అనేక అథ్లెటిక్ శిక్షణా కేంద్రాలు ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ (ఏఈడీ) అనే పోర్టబుల్ పరికరాన్ని కలిగి ఉన్నాయి. కార్డియాక్ అరెస్ట్ సమయంలో చికిత్స చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ పరికరం గుండె లయను రీసెట్ చేయడానికి షాక్‌లను అందిస్తుంది. దీనిని ఉపయోగించడానికి ప్రత్యేక శిక్షణతో పనిలేదు. అవసరమైనప్పుడు మాత్రమే షాక్ ఇచ్చేలా ఈ పరికరంలో ప్రోగ్రామ్ రూపొందించడం విశేషం.
సమస్యను గుర్తించేందుకు సాధారణ ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. తీవ్రమైన మూర్ఛ వచ్చినా లేక వ్యాయామం చేసే సమయంలో మూర్ఛతో సొమ్మసిల్లినా గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. అంతేకాకుండా శ్వాస సమస్యలు, ఛాతీ నొప్పి లాంటివి కూడాగుండె సమస్యకు సంకేతం కావచ్చు. కొన్నిసార్లు ఆస్తమా రోగులకు కూడా గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీళ్లు ఏడాదికి ఒకసారైనా పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అవసరం.
– మహేశ్వర్‌రావు బండారి
– డా॥ ప్రమోద్‌రెడ్డి కందుకురె
ఎఫ్ఆర్సీఎస్(సిటీ ఇంగ్లండ్), ఎంసీహెచ్( సీవీటీఎస్)
క్లినికల్ డైరెక్టర్ కార్డియోథొరాసిక్ అండ్ వాస్క్యులర్
మినమలీ ఇన్వాసివ్ సర్జన్
కేర్ హాస్పిటల్, హైటెక్ సిటీ, హైదరాబాద్