Health tips : చలికాలం వచ్చేసరికి ఒంటి నొప్పులు పెరుగుతాయి. చలి కారణంగా ఎముకలు గట్టిపడటంతో ఇలా జరుగుతుంది. వృద్ధుల్లో సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. కీళ్లనొప్పులు, యూరిక్ యాసిడ్ నొప్పులు వేధిస్తాయి. ముఖ్యంగా యూరిక్ యాసిడ్ పేషెంట్లకు చలికాలం రాగానే సమస్యలు ఎక్కువవుతాయి. మూత్రపిండాలు సరిగ్గా పని చేయనప్పుడు యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. పోషకాహార లోపం, వ్యాయామం లేకపోవడంవల్ల కూడా కీళ్లలో యూరిక్ యాసిడ్ పేరుకుపోతుంది. అయితే ఉసిరి చట్నీతో యూరిక్ యాసిడ్ సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
శీతాకాలంలో ఉసిరికాయ సీజన్ ఉంటుంది. ఈ సీజన్లో యూరిక్ యాసిడ్ రోగులు ఉసిరి చట్నీ ఎక్కువగా తినాలి. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉసిరికాయ ఎలివేటెడ్ యూరిక్ యాసిడ్‌ను తగ్గిస్తుంది. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇది కూడా అధిక యూరిక్ యాసిడ్‌ను తద్వారా కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులు, గౌట్‌తో బాధపడుతున్న రోగులకు ఉసిరి చాలా మంచిది.
ఉసిరి చట్నీ చేయడానికి రెండు లేదా మూడు తాజా ఉసిరికాయలను తీసుకుని కోయాలి. ఇప్పుడు ఉసిరికాయ ముక్కలను మిక్సీలో వేయాలి. అందులో కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి కలుపాలి. కావాలంటే ఒక స్పూన్ తెల్ల నువ్వులను కూడా జోడించవచ్చు. ఇప్పుడు చట్నీని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ చట్నీని రోజూ ఆహారంతోపాటు తీసుకుంటే యూరిక్ యాసిడ్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఉసిరి కాయను చట్నీ రూపంలోనే కాకుండా రకరకాలుగా తీసుకోవచ్చు. అల్లం మురబ్బా మాదిరిగానే ఉసిరికాయ మురబ్బాను కూడా చేసుకుని తినవచ్చు. రాత్రిపూట ఒక టేబుల్ స్పూన్ ఉసిరి రసాన్ని గోరువెచ్చని నీటితో తీసుకోవడంవల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. ఉసిరికాయను తేనెతో కలిపి తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అంతేగాక ఉసిరిని కూరల్లో కూరగాయగా కూడా చేర్చుకోవచ్చు.
ఉసిరికాయ తినడం ద్వారా రోగనిరోధక శక్తి బలపడుతుంది. దాంతో అనేక వ్యాధుల నుంచి మన శరీరం రక్షణ పొందుతుంది. ఉసిరిని సీజన్లో తరచూ తీసుకోవడం ద్వారా కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది.