Tamarind | భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే చింతపండును తమ వంటి ఇంటి సామగ్రిగా ఉపయోగిస్తున్నారు. చింతపండు లేకుండా వంటలను పూర్తి చేయరు. పప్పు లేదా పప్పు చారు వంటకాల్లో, పులుసు వంటకాల్లో చింతపండు పడాల్సిందే. చింత పండు రుచి అంటే చాలా మందికి ఎంతో ఇష్టంగా కూడా ఉంటుంది. అయితే పుల్లగా ఉంటుందని చెప్పి చింత పండును తినేందుకు చాలా మంది ఇష్ట పడరు. ఇక కొందరు గ్యాస్ ట్రబుల్ అని చెప్పి చింత పండును దూరం పెడుతుంటారు. అయితే వాస్తవానికి ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం మనం ఆరు రకాల రుచులను ఆహారంలో భాగం చేసుకోవాలి. వాటిల్లో చింత పండు కూడా ఒకటి. ఈ క్రమంలోనే చింత పండును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. అసలు చింత పండును తింటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
చింతపండులో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన శరీరంలోని కణాలు నాశనం కాకుండా రక్షిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి నుంచి మనల్ని సురక్షితంగా ఉంచుతాయి. శరీరంలో ఉత్పత్తి అయ్యే హానికర ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో ఆటో ఇమ్యూన్ వ్యాధులు రాకుండా రక్షించుకోవచ్చు. అలాగే గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. కళ్లలో శుక్లాలు రావు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. వయస్సు మీద పడడం వల్ల వచ్చే అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. అందువల్ల చింతపండును తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి.
చింతపండులో మెగ్నిషియం అధిక మొత్తంలో లభిస్తుంది. మనకు రోజుకు కావల్సిన మెగ్నిషియంలో చింతపండు ద్వారా దాదాపుగా 25 శాతం మేర పొందవచ్చు. మెగ్నిషియం కండరాల పనితీరును మెరుగు పరుస్తుంది. దీంతో రాత్రి పూట కాలి పిక్కలు పట్టుకుపోకుండా ఉంటాయి. శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసేవారికి కండరాల నొప్పులు ఉంటాయి. అలాంటి వారు మెగ్నిషియం ఉండే ఆహారాలను తింటే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కనుక చింతపండును ఆహారంలో భాగం చేసుకోవచ్చు. అలాగే దీన్ని తినడం వల్ల ఎముకలు సైతం ఆరోగ్యంగా ఉంటాయి. చింతపండులో ఉండే మెగ్నిషియం మన శరీరంలో 300కు పైగా విధులను నిర్వర్తిస్తుంది. దీంతో మనం ఆరోగ్యంగా ఉంటాం.
చింతపండులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి. నొప్పుల నుంచి ఉపశమనం అందిస్తాయి. ఆర్థరైటిస్ నొప్పులతో బాధపడేవారికి చింతపండు ఎంతగానో మేలు చేస్తుంది. చింత గింజలు కూడా ఈ నొప్పులను తగ్గించగలవు. చింతగింజలను వేయించి వాటిల్లో ఉండే పప్పు తీసి దాన్ని పొడిలా చేయాలి. అందులో కాస్త నీళ్లు కలిపి గోరు వెచ్చగా ఉన్నప్పుడే కీళ్లు లేదా మోకాళ్లపై రాస్తుండాలి. దీంతో కీళ్లు, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. చింత పండును తీసుకుంటున్నా కూడా ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాదు, జీర్ణ సమస్యలను తగ్గించడంలోనూ చింత పండు పనిచేస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కనుక ఇకపై చింత పండును అంత లైట్ తీసుకోకండి. కచ్చితంగా దీన్ని మీరు ఆహారంలో భాగం చేసుకోండి. అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.