Red Banana | మార్కెట్లో మనకు ఎన్నో రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే అందరూ తమకు నచ్చిన లేదా తమ స్థోమతకు తగినట్లుగా పండ్లను కొని తింటుంటారు. ఇక పేదల నుంచి ధనికుల వరకు అందరూ తినే పండ్లు కూడా ఉన్నాయి .అలాంటి వాటిల్లో అరటి పండ్లు కూడా ఒకటి. ఇవి మనకు సీజన్లతో సంబంధం లేకుండా ఏ సీజన్లో అయినా సరే అందుబాటులో ఉంటాయి. అరటి పండ్లలోనూ అనేక రకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. వాటి సైజును బట్టి కూడా వెరైటీలు ఉంటాయి. అయితే మీరు ఎరుపు రంగులో ఉండే అరటి పండ్లను చూసే ఉంటారు. ఇవి మనకు ఎక్కువగా సూపర్ మార్కెట్లలోనే కనిపిస్తాయి. అయితే పసుపు రంగు అరటి పండ్ల మాదిరిగానే ఎరుపు రంగు అరటి పండ్లు కూడా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఎరుపు రంగు అరటి పండ్లను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.
ఎరుపు రంగు అరటి పండ్లలో బీటాకెరోటీన్ అధికంగా ఉంటుంది. అందుకనే అవి ఆ రంగులో ఉంటాయి. ఇది మన శరీరంలో విటమిన్ ఎగా మారుతుంది. విటమిన్ ఎ మన కళ్ల ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది. కంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో సీజనల్ వ్యాధుల నుంచి ఉఫశమనం లభిస్తుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. రోగాలు రాకుండా అడ్డుకోవచ్చు. ఎరుపు రంగు అరటి పండ్లలో ఫైబర్ కూడా అధికంగానే ఉంటుంది. అందువల్ల ఈ పండ్లను తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. దీని వల్ల బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. కనుక బరువు తగ్గాలని చూస్తున్న వారు లేదా డైట్లో ఉన్నవారు నిరభ్యంతరంగా ఈ పండ్లను ఆహారంలో భాగం చేసుకోవచ్చు.
పసుపు రంగు అరటి పండ్లతో పోలిస్తే ఎరుపు రంగు అరటి పండ్లలో ఫైబర్ ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కనుక ఎరుపు రంగు అరటి పండ్లను తింటే బరువు పెరుగుతామన్న భయం ఉండదు. బరువు నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గాలని చూస్తున్న వారికి ఈ పండ్లు ఎంతగానో సహాయం చేస్తాయి. అలాగే ఈ పండ్లను సాయంత్రం సమయంలో స్నాక్స్‌కు బదులుగా తినవచ్చు. సాయంత్రం చాలా మంది చిరుతిళ్లను తినాలని చూస్తుంటారు. అవి ఆరోగ్యానికి హానికరం. కనుక ఎరుపు రంగు అరటి పండ్లను తింటే ఓవైపు జిహ్వా చాపల్యం తీరుతుంది. మరోవైపు పోషకాలు, శక్తి రెండూ లభిస్తాయి. అలాగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఈ పండ్లను తింటే ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది కనుక జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణక్రియ పెరుగుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు.
పసుపు రంగు అరటి పండ్ల కన్నా ఎరుపు రంగు అరటి పండ్లలో విటమిన్ బి6, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. దీంతో హైబీపీ కంట్రోల్ అవుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు. ఎరుపు రంగు అరటి పండ్ల గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. కనుక ఈ పండ్లను తింటే అంత సులభంగా షుగర్ లెవల్స్ పెరగవు. పైగా షుగర్ తగ్గేందుకు ఈ పండ్లు సహాయం చేస్తాయి. కనుక ఎరుపు రంగు అరటి పండ్లను డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తింటే ఎంతగానో మేలు చేస్తుంది. ఇలా ఎరుపు రంగు అరటి పండ్లను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చు.