Tulsi seeds benefits | తులసి మొక్క.. ప్రతి హిందువుల ఇండ్లలో సాధారణంగా కనిపించే మొక్క. దీనిని దేవతాస్వరూపంగా భావించి పూజిస్తాం. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉండటం వల్లనే ఈ మొక్కను ఇండ్లలో పెంచుకుంటారని నిపుణులు చెప్తున్నారు. తులసి ఆకులను తింటుంటారు. అలాగే దీని విత్తనాలను కూడా తినొచ్చు. తులసి విత్తనాలను తినడం ద్వారా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
వీటినే తీపి తులసి గింజలు, సబ్జా గింజలు లేదా తుక్మారియా గింజలు అని కూడా అంటారు. వీటిలో అధిక పోషకాలతోపాటు కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఐరన్, జింక్, మెగ్నీషియం, అనేక విటమిన్లు, ప్రొటీన్లు లభిస్తాయి. శరీరం బరువు తగ్గడం, గుండె ఆరోగ్యం, జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి సమస్యల నివారణలో ప్రయోజనకారిగా ఉంటుంది.
ఇవీ ఆరోగ్య ప్రయోజనాలు..
తులసి గింజల్లో యాంటీస్పాస్మోడిక్ లక్షణాలను కలిగి ఉండి జలుబు, దగ్గు చికిత్సకు సహాయపడతాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే ఫ్లేవనాయిడ్లను కలిగి ఉంటాయి. దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి నీటిలో తులసి గింజలు, తేనె కలిపి తీసుకోవాలి.
తులసి గింజల్లో ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. వీటిని రసాలు లేదా సలాడ్లతో కలిపి తీసుకోవడం ద్వారా ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేందుకు సహాయపడతాయి. తినాలనే కోరికలను నియంత్రించుకోవడం ద్వారా శరీరం బరువును తగ్గించుకోవడంలో సహాయపడుతుంది.
అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారిలో రక్తపోటు, చక్కెర స్థాయిలను తగ్గించడానికి తులసి గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి. టైప్-2 మధుమేహం ఉన్నవారికి ఇవి ఎంతో ప్రయోజనకారిగా ఉంటాయి.
తులసి గింజలు శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సాయపడతాయి. వీటిలోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు.. ఫ్రీ రాడికల్ డ్యామేజ్ను నిరోధించడంలో సహాయపడతాయి.
చాలా మందిలో ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో ఎంతో ఉత్తమంగా పనిచేస్తుంది. వీటిని తీసుకోవడం ద్వారా మంచి నిద్రను పొందవచ్చు.
జీర్ణ సమస్యల వల్ల కలిగే అసౌకర్యాన్ని తులసి గింజల సహాయంతో నయం చేసుకోవచ్చు. ఇవి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి.
తులసి గింజలు మహిళలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి. మహిళల్లో అండోత్సర్గం, సంతానోత్పత్తికి సాయపడతాయి. అలాగే, ఋతుస్రావం, గర్భధారణ సమయంలో హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. అండాశయాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
తులసి గింజలను తీసుకోవడం ద్వారా ముఖంపై మొటిమలు తొలగించుకోవచ్చు. ఇది క్లీనింగ్ ఏజెంట్గా పనిచేసి చర్మంలో అదనపు నూనె ఉత్పత్తిని తగ్గిస్తుంది. అంతేకాకుండా చర్మంపై బ్యాక్టీరియా పెరగకుండా నిరోధించి ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఇవీ సైడ్ ఎఫెక్ట్స్..
తులసి గింజలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, పొత్తికడుపు తిమ్మిర్లు, విరేచనాలు సంభవించవచ్చు. వీటిని మింగడంలో ఇబ్బందులు ఉన్నవారు తులసి గింజలను నీటిలో నానబెట్టిన తర్వాత తినాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఇది అర్హత కలిగిన వైద్య అభిప్రాయానికి ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ వైద్య నిపుణుడిని లేదా ఇంటి వైద్యుడిని సంప్రదించండి. ఈ కథనంతో ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యం ఎలాంటి బాధ్యత వహించదు.