Black Pepper | భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే నల్ల మిరియాలను వంటల్లో ఉపయోగిస్తున్నారు. మిరియాల్లో రెండు రకాలు ఉంటాయి. తెలుపు రంగు మిరియాలు కూడా ఉంటాయి. కానీ మనం నల్ల మిరియాలనే వాడుతుంటాం. ఇవి మన వంట ఇంటి పోపు దినుసుల్లో ఒకటిగా ఉన్నాయి. అయితే ఘాటుగా ఉంటాయి కనుక చాలా మంది మిరియాలను తినేందుకు ఇష్టపడరు. కానీ ఆయుర్వేదంలో మిరియాలకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మిరియాలు ఘాటుగా ఉన్నప్పటికీ ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మిరియాలను మనం రోజువారి ఆహారంలో భాగం చేసుకోవచ్చు. మనం తినే ఆహారాలపై మిరియాల పొడి చల్లి తినవచ్చు. లేదా మిరియాలను నీటిలో వేసి మరిగించి తాగవచ్చు. ఇలా ఏ విధంగా మిరియాలను తీసుకున్న మనకు ఆరోగ్య ప్రయోజనాలే కలుగుతాయి. మిరియాల వల్ల అనేక వ్యాధులు నయమవుతాయని ఆయుర్వేదం చెబుతోంది.
మిరియాలను ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే మంచిది. దీంతో రోజంతా మెటబాలిజం ఎక్కువగా ఉంటుంది. క్యాలరీలు వేగంగా ఖర్చువుతూనే ఉంటాయి. దీంతో మనం పనిచేయకపోయినా కొవ్వు కరుగుతూనే ఉంటుంది. ఇలా జరగడం వల్ల అధిక బరువు తగ్గుతారు. కనుక బరువు తగ్గాలనుకునే ప్రణాళికలో ఉన్నవారు ఉదయం మిరియాలను తింటే ప్రయోజనం ఉంటుంది. మిరియాలను తినడం వల్ల శరీరంలోని వాపులు, నొప్పులు కూడా తగ్గుతాయి. మిరియాలలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. చలికాలంలో ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. కనుక ఈ నొప్పులు ఉన్నవారు మిరియాలను రోజూ తినాల్సి ఉంటుంది.
మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. కణాలను రక్షిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా క్యాన్సర్, గుండె పోటు వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. దగ్గు, జలుబు ఉన్నవారు మిరియాలను తింటుంటే వెంటనే ఫలితం ఉంటుంది. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం తొలగిపోతుంది. మిరియాలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. అజీర్తి తగ్గుతుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు. తిన్న వెంటనే గ్యాస్ వచ్చే వారు మిరియాలను తింటే ప్రయోజనం ఉంటుంది. మిరియాలను తినడం వల్ల మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. దీంతో శరీరానికి పోషణ లభిస్తుంది.
మిరియాలు శరీరంలో రక్త సరఫరాను పెంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూసుకోవచ్చు. దీని వల్ల హార్ట్ ఎటాక్‌లు రాకుండా అడ్డుకోవచ్చు. మిరియాలలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి మొటిమలు, మచ్చలను తగ్గిస్తాయి. మిరియాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతాయి. చర్మానికి రక్షణ లభిస్తుంది. మిరియాలలో పైపరైన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. దీంతో మెదడు ఉత్తేజంగా మారుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. ఇలా మిరియాలను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.