Avocado Oil | అవకాడో పండు మనకు ఎంతో ఆరోగ్యాన్నిస్తుంది. వీటిని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. కేవలం పండునే కాకుండా దాని నుంచి తీసిన నూనె కూడా మన ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తమైనది. ఈ నూనెలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బీ, ఈ తో పాటు యాంటీ యాక్సిండెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, మినరల్స్ ఉండి మన చర్మం, జుట్టును కాపాడటంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఈ నూనెను రెగ్యులర్ బ్యూటీ పనులతో పాటు హెయిర్ మాస్క్‌లో లేదా చర్మానికి ఉపయోగించే రెగ్యులర్ క్రీముల్లో మిక్స్ చేసి ఉపయోగించడం వల్ల ఆశించిన ఫలితాలను పొందవచ్చు.
గుండెకు ఎంతో మేలు..
అవకాడో నూనెలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉండి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. శరీరం నుంచి విషాలను బయటకు పంపుతుంది. తద్వారా రక్త నాళాలను రక్షిస్తుంది. అవకాడో నూనెను ఉపయోగించడం వల్ల కిడ్నీలో అవసరమైన కొవ్వు ఆమ్లాల స్థాయిని సమతుల్యం చేస్తుంది. ధమనుల గోడలకు నష్టం జరగకుండా సాయపడుతుంది.
చర్మానికి ఎంతో మంచిది..
అవోకాడో ఆయిల్లో బీటా కెరోటిన్, ప్రొటీన్, లుటీన్, విటమిన్ ఈ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉండి చర్మాన్ని బలోపేతం చేయడంలో సాయపడుతుంది. అవకాడో ఆయిల్ చర్మాన్ని పోషించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. హానికరమైన యూవీ కిరణాల నుంచి రక్షణను అందిస్తుంది. చర్మంపై మచ్చలను నయం చేస్తుంది. ముడతలను నివారిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని యవ్వనంగా చేస్తుంది.
జుట్టు పెరుగుదలకు ఊతం..
అవోకాడో నూనెలో విటమిన్ బీ, విటమిన్ ఈ ఉండి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. స్కాల్ప్ ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది. తైల గ్రంథులకు సంకేతాలను పంపి తలపై నూనె అధిక ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గడం సాయం..
అవోకాడో నూనెలో మోనోశాచురేటెడ్ కొవ్వులు, ఒలియాక్ యాసిడ్ పుష్కలంగా ఉండటం వల్ల బరువు తగ్గడంలో గొప్పగా సహాయపడుతుంది. ఇది బొడ్డు చుట్టూ కొవ్వును తగ్గిస్తుంది. శరీరంలోని జీవక్రియ రేటును పెంచుతుంది. కొవ్వులో కరిగే కెరోటినాయిడ్లను గ్రహించి బరువు తగ్గడానికి సాయపడుతుంది.
పోషకాలను శోషిస్తుంది..
అవకాడో ఆయిల్లో మోనోశాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉండటం వల్ల శరీరంలోని పోషకాలను గ్రహించే స్థాయిని పెంచుతుంది.
కళ్లకు ఆరోగ్యాన్నిస్తుంది..
అవోకాడో నూనెలో లుటిన్, విటమిన్ ఈ పుష్కలంగా ఉన్నందున కళ్ల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. కంటిశుక్లం, కంట్లో మచ్చల క్షీణత ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఉబ్బరాన్ని నిరోధిస్తుంది..
అవకాడో ఆయిల్ తీసుకోవడం వల్ల శరీరంలో ఎనర్జీ లెవెల్స్‌ను మెరుగుపరుస్తుంది మరియు జీర్ణక్రియను మెరుగురిచి ఉబ్బరం నివారిస్తుంది.
వాపులను తగ్గిస్తుంది..
అవోకాడో ఆయిల్ ఆర్థరైటిస్ ఉన్నవారికి చాలా అనుకూలమైనది. ఇది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. కీళ్లలో దృఢత్వాన్ని తగ్గించడమే కాకుండా చిగుళ్ల నుంచి రక్తస్రావం సమస్యలను నివారిస్తుంది.
గాయాలను నయం చేస్తుంది..
అవకాడో నూనె గాయాలను వేగంగా నయం చేయడంలో సాయపడుతుంది. అవకాడో ఆయిల్లో ఉండే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ మంటను తగ్గిస్తుంది. కీటకాలు కుట్టినప్పుడు అవకాడో నూనె రాసి ఉపశమనం పొందవచ్చు.
వడదెబ్బ నుంచి రక్షణ..
అవోకాడో నూనెలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఈ, బీటా కెరోటిన్, ప్రోటీన్లు పుష్కలంగా ఉండి వడదెబ్బ నుంచి మనల్ని కాపాడుతుంది.
చివరగా..
ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా అవకాడో ఆయిల్‌ను తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. ఈ నూనెను అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల దురద, జీర్ణశయాంతర సమస్యలు, నోటి అలెర్జీలు వంటి ప్రతిచర్యలకు కారణమవుతుంది. హైపర్సెన్సిటివిటీ ఉన్నవారు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు అవకాడో నూనెను వాడకుండా ఉండటం శ్రేయస్కరం.