Almonds To Kids | చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలని, వారు రోజూ పౌష్టికాహారం తీసుకోవాలని, చదువుల్లోనూ రాణించాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే చిన్నారులు ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి ఆహారాలను వారికి ఇవ్వాలి అని తల్లిదండ్రులు చాలా మందికి సందేహాలు వస్తుంటాయి. అందుకు పోషకాహార నిపుణులు ఒకే ఒక సమాధానం చెబుతున్నారు. అదేమిటంటే.. పిల్లలకు పోషకాలు లభించి వారు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ బాదంపప్పును పెడితే సరిపోతుందని వారు సూచిస్తున్నారు. బాదంపప్పులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి పెద్దలకే కాదు, పిల్లలకు కూడా అనేక లాభాలను అందిస్తాయి. బాదంపప్పును నీటిలో నానబెట్టి అనంతరం వాటి పొట్టు తీసి పిల్లలకు పెట్టాల్సి ఉంటుంది. దీంతో అవి సులభంగా జీర్ణం అవుతాయి. అనేక పోషకాలు వారికి చాలా సులభంగా లభిస్తాయి. బాదంపప్పును రోజూ పిల్లలకు వారి గుప్పెడు మోతాదులో పెడుతుంటే వారు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. చదువుల్లోనూ రాణిస్తారు.
బాదంపప్పును పిల్లలకు రోజూ పెట్టడం వల్ల వారి మెదడు పనితీరు మెరుగు పడుతుంది. మెదడు యాక్టివ్గా మారి ఉత్సాహంగా ఉంటారు. రోజంతా చురుకుదనం ఉంటుంది. నీరసం, అలసట తగ్గుతాయి. బద్దకం పోతుంది. ప్రతి విషయాన్ని వారు సులభంగా నేర్చుకుంటారు. బాదంపప్పులో ఉండే ప్రోటీన్లు మెదడు కణాలకు మరమ్మత్తులు చేస్తాయి. ఈ పప్పులో ఉండే విటమిన్ ఇ, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పిల్లల మెదడు పనితీరును మెరుగు పరిచి వారు యాక్టివ్గా ఉండేలా చేస్తాయి. బాదంపప్పులో అధికంగా ఉండే మెగ్నిషియం నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. బాదంపప్పును పిల్లలకు రోజూ పెట్టడం వల్ల వారిలో ఐక్యూ లెవల్స్ పెరుగుతాయని, వారు ప్రతిభావంతులుగా మారుతారని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో తేలింది.
బాదంపప్పులను పిల్లలు తినడం వల్ల వారిలో ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. వారి మెదడు పనితీరు మెరుగు పడి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. దీంతో వారు చదువుల్లో రాణిస్తారు. తెలివితేటలు పెరుగుతాయి. బాదంపప్పులో అనేక యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ ఉంటాయి. అందువల్ల పిల్లలు ఈ పప్పును తింటే వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల సీజనల్గా వచ్చే దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాగే ఇన్ఫెక్షన్లు సైతం తగ్గుతాయి. ఈ పప్పులో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది. దీంతో రక్తహీనత తగ్గుతుంది. పిల్లలకు రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లేదా సాయంత్రం స్నాక్స్ రూపంలో బాదంపప్పును ఇవ్వవచ్చు. ఈ పప్పును తింటే శరీరంలో కొవ్వు చేరదు. దీని వల్ల వారి బరువు నియంత్రణలో ఉంటుంది. అధిక బరువు పెరగకుండా చూసుకోవచ్చు.
బాదంపప్పును పిల్లలకు పెడితే వారి శరీర దారుఢ్యం పెరుగుతుంది. వారు చిన్నతనం నుంచి శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. దీని వల్ల పెద్దయ్యాక అనేక రోగాలు రాకుండా చూసుకోవచ్చు. బాదంపప్పులో ఉండే క్యాల్షియం ఎముకలకు బలాన్నిస్తుంది. అందువల్ల ఈ పప్పును పిల్లలకు పెడితే వారి ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. చిన్న చిన్న దెబ్బలకు సైతం ఎక్కువ గాయం అవకుండా ఉంటుంది. అలాగే విరిగిన ఎముకలు సైతం త్వరగా అతుక్కుంటాయి. బాదంపప్పులో క్యాల్షియం, మెగ్నిషియం, మాంగనీస్, విటమిన్ కె, ప్రోటీన్లు, కాపర్, జింక్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ చిన్నారులను ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతగానో సహాయం చేస్తాయి. కనుక బాదంపప్పును వారికి రోజూ పెడుతుంటే వారు ఆరోగ్యంగా ఉంటారు.