Ajwain Leaves | మన చుట్టూ పరిసరాల్లో అనేక రకాల మొక్కలు పెరుగుతుంటాయి. వాటిల్లో ఔషధ గుణాలు ఉండే మొక్కలు చాలానే ఉన్నాయి. కానీ వాటి గురించి చాలా మందికి తెలియదు. వాటిని చూస్తే చాలా మంది పిచ్చి మొక్కలని అనుకుంటారు. అయితే అవి అందించే ప్రయోజనాల గురించి చాలా మందికి అవగాహన లేదు. ఇప్పుడు చెప్పబోయే మొక్క కూడా అలాంటిదే. అదే వాము మొక్క. చూసేందుకు ఇది పిచ్చి మొక్కలా ఉంటుంది. కానీ ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అద్భుతమైన లాభాలను అందిస్తుంది. వాము మొక్క ఆకులు వాము వాసననే కలిగి ఉంటాయి. వీటిని నీటిలో మరిగించి ఆ నీళ్లను తాగవచ్చు. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. వాము మొక్క పలు వ్యాధులను నయం చేస్తుందని వారు అంటున్నారు.
వాము మొక్క ఆకులు జీర్ణ సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఈ ఆకుల్లో ఉండే పలు సమ్మేళనాలు మన జీర్ణ వ్యవస్థలో ఎంజైమ్‌లను యాక్టివేట్ చేస్తాయి. దీంతో జీర్ణశక్తి మెరుగు పడుతుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అజీర్తి తగ్గుతుంది. ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. వాము ఆకుల నీళ్లను తాగడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పొట్టలో ఉండే అసౌకర్యం తొలగిపోవడంతోపాటు కడుపు నొప్పి తగ్గుతుంది. తీవ్రమైన గ్యాస్ సమస్య ఉన్నవారికి ఈ ఆకులు ఎంతో మేలు చేస్తాయి. శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలోనూ ఈ ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. దగ్గు, జలుబు, ఇతర శ్వాస సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫం కరిగిపోతుంది. శ్వాస నాళాలు క్లియర్‌గా మారి గాలి సరిగ్గా లభిస్తుంది. ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆస్తమా, బ్రాంకైటిస్ ఉన్నవారికి సైతం మేలు జరుగుతుంది.
వాము ఆకుల్లో థైమోల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటుంది. అందువల్ల వాము ఆకులను పేస్ట్‌లా చేసి చర్మంపై రాస్తుంటే చర్మ ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. గజ్జి, తామర వంటి చర్మ వ్యాధుల నుంచి బయట పడవచ్చు. వాము ఆకుల్లో ఉండే మినరల్స్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ గా వచ్చే వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. చిన్నారులకు సైతం ఈ ఆకులు ఎంతో మేలు చేస్తాయి. వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తరచూ వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. ఆరోగ్యం మెరుగు పడుతుంది.
వాము ఆకులను నోట్లో వేసుకుని నమిలితే ఎంతో మేలు జరుగుతుంది. ఈ ఆకుల్లో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు నోట్లో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. వాము ఆకుల నీళ్లను తాగుతుంటే బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఈ ఆకుల నీళ్లను సేవిస్తే శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీని వల్ల క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. వాము ఆకులను నీటిలో వేసి మరిగించి తాగవచ్చు. లేదా ఈ ఆకుల జ్యూస్‌ను కాస్త తీసి దాన్ని కొద్దిగా తేనెతో కలిపి తీసుకోవచ్చు. చర్మంపై పూతగా ఉపయోగించవచ్చు. లేదా మీరు రోజూ చేసుకునే కూరల్లో, ఇతర వంటల్లోనూ వేయవచ్చు. ఇలా ఈ ఆకులతో అనేక లాభాలను పొందవచ్చు.