వర్షకాలం వచ్చిందంటే పిల్లలను రకరకాల సమస్యలు పలకరిస్తుంటాయి. అందులో ఒకటి అక్యూట్ గ్యాస్ట్రో ఎంట్రైటిస్. అంటే పిల్లలు డయేరియా బారిన పడతారు. ఆహారం, పానీయాలు కలుషితం కావడం వల్ల ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది. అంతేకాదు కొన్నిసార్లు వైరస్ల వల్ల కూడా ఈ ఇబ్బంది తలెత్తుతుంది. బ్యాక్టీరియా కారణంగా, టైఫాయిడ్ వల్ల కూడా డయేరియల్ ఇల్నెస్ వస్తుంటుంది. అక్యూట్ గ్యాస్ట్రో ఎంట్రైటిస్ వల్ల పిల్లలకు వాంతులు, విరేచనాలు అవుతుంటాయి.
పొట్టలో నొప్పి పుడుతుంది. ఈ సమయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. మామూలుగా విరేచనాలు, వాంతులు అయినంత మాత్రాన తీవ్రంగా కంగారుపడాల్సిన పనిలేదు. కానీ, విపరీతంగా విరేచనాలు అవుతున్నా, పసరులా వాంతులు చేసుకుంటున్నా, భరించరాని పొట్ట నొప్పితో చికాకుగా ఏడుస్తున్నా.. సమస్య తీవ్రంగా ఉందని అంచనాకు రావాలి. వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి.
ఈ సమయంలో పిల్లలు చాలా నిస్తత్తువగా మారిపోతారు. మత్తుగా పడుకుంటూ ఉంటారు. మలంలో రక్తం పడుతుంటుంది కూడా! ఒంటి మీద దద్దుర్లు వస్తాయి. నాలుక పిడుచ కట్టుకుపోతుంది, యూరిన్ అవుట్‌పుట్ సరిగ్గా ఉండదు. ఇలాంటి పరిస్థితి గమనించినట్లయితే వెంటనే పిల్లల వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. ఇక పిల్లలు డీహైడ్రేషన్‌కు గురికాగానే మార్కెట్లో దొరికే ఓఆర్ఎస్ఎల్ ప్యాక్‌లు తెచ్చి వారికి తాగిస్తుంటారు. ఇవి తాగించడం వల్ల మేలు జరగకపోగా, కీడు కలుగుతుంది. వైద్యుడు సిఫారసు చేసిన స్టాండర్డ్ ఓఆర్ఎస్ (గ్లూకోజ్ గాఢత తగ్గించినవి) మాత్రమే అందివ్వాలి. అన్నిటికన్నా ముఖ్యంగా, పిల్లలు ఇబ్బందిని గమనించి వైద్యుణ్ని సంప్రదించడం చాలా అవసరమని గుర్తించండి.
– డాక్టర్ అనుపమ. వై సీనియర్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, హైదరాబాద్