Acidic Body Symptoms | మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీర పీహెచ్ స్థాయిలు ఎల్లప్పుడూ 7.35 నుంచి 7.45 మధ్య ఉండాలి. రక్తం, శరీర కణజాలం ఇలా అన్ని చోట్లా పీహెచ్ విలువ సరిగ్గా ఉంటేనే మొత్తంగా పీహెచ్ విలువ సరైన స్థాయిలో ఉంటుంది. అయితే కొన్ని కారణాల వల్ల మన శరీరంలో అప్పుడప్పుడు ఆమ్లత్వం పెరిగిపోతూ ఉంటుంది. ఆహారపు అలవాట్లలో మార్పుల వల్లే ఇలా జరుగుతుందని చెప్పవచ్చు. ప్రాసెస్ చేయబడిన ఆహారాలను అధికంగా తినడం, చక్కెర ఎక్కువగా తీసుకోవడం, జంతు సంబంధ ప్రోటీన్లను అధికంగా తినడం, తీవ్రమైన ఒత్తిడి, పలు రకాల అనారోగ్య సమస్యలు ఉండడం వంటి కారణాల వల్ల శరీరంలో ఆమ్లత్వం పెరిగిపోతుంది. దీంతో శరీర పీహెచ్ స్థాయిలు తగ్గుతాయి. అయితే ఇలాంటి సమయంలో మన శరీరం పలు లక్షణాలను, సంకేతాలను తెలియజేస్తుంది. వాటిని బట్టి మన శరీర పీహెచ్ లెవల్స్ తగ్గాయని గుర్తించాలి. వెంటనే ఈ లక్షణాలకు అనుగుణంగా జాగ్రత్తలు వహించాలి. దీంతో పీహెచ్‌ను పెంచుకోవచ్చు. రోగాలు రాకుండా ముందుగానే అడ్డుకోవచ్చు. ఇక శరీరంలో ఆమ్లత్వం పెరిగిందని తెలియజేసే ఆ సంకేతాలు ఏమిటంటే..
మీరు రోజూ తగినంత నిద్రపోతున్నా, వేళకు భోజనం చేస్తున్నా, తగినన్ని నీళ్లను తాగుతున్నా కూడా ఉదయం నిద్ర లేచిన వెంటనే మొదలుకొని రోజు మొత్తం అలసటగా, నీరసంగా ఉంటుందా. చిన్న పని చేసినా విపరీతమైన అలసట వస్తుందా. అయితే మీ శరీరంలో ఆమ్లత్వం పెరిగిపోయిందని చెప్పేందుకు ఇది ఒక సంకేతం. ఆమ్లత్వం పెరిగితే మనం తినే ఆహారం గ్లూకోజ్‌గా మారినా కూడా శరీర కణాలకు లభించదు. దీంతో తీవ్రమైన అలసట ఉంటుంది. ఇలా ఎవరికైనా ఉంటే దాన్ని ఆమ్లత్వంగా పరిగణించాలి. వెంటనే డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాలి. అదేవిధంగా శరీరంలో ఆమ్లత్వం పెరిగిపోతే ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గుతుంది. దీంతో తరచూ దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తుంటాయి. మీకు కూడా తరచూ దగ్గు, జలుబు గనక వస్తుంటే శరీరంలో ఆమ్లత్వం పెరిగిందేమో చెక్ చేయించుకోండి. దీంతో ముందుగానే జాగ్రత్త పడిన వారవుతారు.
శరీరంలో ఆమ్లత్వం పెరిగిపోతే ఆ ప్రభావం జీర్ణ వ్యవస్థపై కూడా పడుతుంది. తేలికపాటి ఆహారం తీసుకున్నా కూడా పొట్టలో ఉబ్బరం మొదలవుతుంది. గ్యాస్, అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు ఉంటాయి. ఇలా గనక ఉంటే శరీరంలో ఆమ్లత్వం పెరిగిందేమో చెక్ చేయించుకోవాలి. అలాగే శరీరంలో ఆమ్లత్వం పెరిగితే పలు రకాల విటమిన్లు, మినరల్స్ లోపం ఏర్పడుతుంది. ముఖ్యంగా మెగ్నిషియం, క్యాల్షియం, పొటాషియం వంటి మినరల్స్ లోపం ఏర్పడుతుంది. దీంతో కండరాల నొప్పి, తీవ్రమైన నీరసం, అలసట, తరచూ కాలి పిక్కలు పట్టుకుపోవడం, చిన్న పనికే తీవ్రమైన అలసట రావడం వంటి సమస్యలు ఉంటాయి. ఇలా గనక ఉంటే శరీర పీహెచ్ స్థాయి తగ్గిందని గుర్తించాలి.
శరీరంలో ఆమ్లత్వం పెరిగితే కీళ్ల వద్ద వాపులు ఏర్పడుతాయి. ఆ ప్రాంతంలో నొప్పిగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్, గౌట్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా ఉంటే టెస్ట్ చేయించుకోవడం మంచిది. అదేవిధంగా శరీరంలో ఆమ్లత్వం ఉంటే మొటిమలు వస్తుంటాయి. అవి ఒక పట్టాన తగ్గవు. చర్మం ఎరుపు రంగులోకి మారుతుంది. దురద పెడుతుంది. కొందరికి దద్దుర్లు కూడా వస్తాయి. శరీరంలో యాసిడ్ లెవల్స్ మరీ ఎక్కువగా ఉంటే ఆ ప్రభావం దంతాలపై కూడా పడుతుంది. దంతాలపై ఉండే సహజసిద్ధమైన ఎనామిల్ పొర కరిగిపోతుంది. దీంతో దంతాలు జివ్వుమని లాగుతాయి. ఇలా శరీర ఆమ్లత్వరం పెరిగితే పలు లక్షణాలను మనం ముందుగానే గుర్తించవచ్చు. దీంతో ఆమ్లత్వాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు. ఫలితంగా తీవ్రమైన వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.