Poop Color | ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో ఉండే వ్యర్థాలను, శరీరంలో వెలువడే వ్యర్థాలను మన శరీరం మలం రూపంలో బయటకు పంపిస్తుంది. ప్రతిరోజూ మలవిసర్జన చేయడం కూడా చాలా అవసరం. మలవిసర్జన చేయకపోవడం వల్ల జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. తద్వారా మొత్తం శరీర ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కనుక ప్రతిరోజూ మలవిసర్జన చేయడాన్ని అలవాటుగా చేసుకోవాలి. ఇక మనం విసర్జించే మలం రంగున్ని బట్టి కూడా మన శరీర ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చు. చాలా మంది ఈ విషయాన్ని చర్చించడానికి ఇష్టపడకపోవచ్చు. కానీ మన మలం రంగు కొన్ని సార్లు మన శరీరంలో ఉండే తీవ్ర అనారోగ్య సమస్యలను తెలియజేస్తాయి. మన మలం రంగు దేనిని సూచిస్తుంది.. రంగును బట్టి ఆరోగ్యాన్ని ఎలా అంచనా వేయాలి.. ఏ సమయంలో వైద్యున్ని సంప్రదించాలి.. అన్న వివరాలను వైద్యులు తెలియజేస్తున్నారు.
గోధుమరంగు మలం చక్కని ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఇది చక్కటి ప్రేగు ఆరోగ్యాన్ని అలాగే ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను సూచిస్తుంది. ఇక సాధారణంగా ఆకుపచ్చ కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకున్నప్పుడు మలం ఆకుపచ్చ రంగులో వస్తుంది. ఇది అందరికి తెలిసిందే. కానీ కొన్ని సందర్భాల్లో ప్రేగు నుండి ఆహారం త్వరగా కదలడం వల్ల కూడా మలం ఆకుపచ్చ రంగులో వస్తుంది. ఉదాహరణకు అతిసారం సమయంలో పిత్తరసాలు పూర్తిగా విచ్చినం చేయబడానికి తగినంత సమయం ఉండదు. అలాంటి సమయంలో కూడా మలం ఆకుపచ్చ రంగులో వస్తుంది. కనుక మలం ఆకుపచ్చ రంగులో రావడం అన్ని సందర్భాల్లో మంచిది కాదు.
పసుపు రంగులో మలం రావడం మంచిది కాదు. పసుపు రంగు మలంలో కొవ్వు అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఇది ప్యాంక్రియాటిక్ లోపాన్ని, పిత్త ఆమ్ల లోపాన్ని, ఉదర వ్యాధులను సూచిస్తుంది. శరీరం పోషకాలను పూర్తిగా గ్రహించకపోవడం కూడా పసుపు రంగు మలానికి ఒక సంకేతమని వైద్యులు చెబుతున్నారు. కనుక పసుపు రంగు మలాన్ని గమనించిన వెంటనే వైద్యున్ని సంప్రదించడం చాలా అవసరం. లేత రంగు మలం కూడా మన ఆరోగ్యానికి ఒక హెచ్చరిక లాటిందే. తీసుకున్న ఆహారంలో పిత్త రసాలు కలవకపోవడం వల్ల మలం లేత రంగులో వస్తుంది. పిత్త వాహికలు, పిత్తాశయంలో అడ్డంకులు, కాలేయ సమస్యల కారణంగా ఇలా జరగవచ్చు. కనుక ఇటువంటి సందర్భంలో కూడా వైద్యున్ని తప్పకుండా సంప్రదించాలి.
నీలం లేదా ఊదారంగులో మలం చాలా తక్కువ సందర్భాల్లో మనం గమనించవచ్చు. నీలం లేదా ఊదా రంగు ఆహారాలను ఎక్కువగా తీసుకున్నప్పుడు మాత్రమే ఈ రంగుల్లో మలాన్ని మనం చూడవచ్చు. ఐరన్ సప్లిమెంట్స్ ను తీసుకోవడం వల్ల మలం నలుపు రంగులో లేదా తారు రంగులో వస్తుంది. కానీ కొన్నిసార్లు ఇది ప్రేగుల్లలో రక్తస్రావాన్ని, పుండ్లను కూడా సూచిస్తాయి. దీని ఫలితంగా మలం నల్లగా, బంకలాగా వస్తుంది. ఇటువంటి సందర్భాల్లో తక్షణ వైద్య సహాయాన్ని తీసుకోవడం చాలా అవసరం. బీట్రూట్ వంటి ఆహారాలను తీసుకున్నప్పుడు కూడా మలం ఎరుపు రంగులో వస్తుంది. ఇది సాధారణమే. కానీ అన్ని సందర్భాల్లో దీనిని నిర్లక్ష్యం చేయకూడదు. పెద్ద ప్రేగు, పురీశనాళం, దిగువ జీర్ణశయాంతర ప్రేగులల్లో రక్తస్రావం జరిగినప్పుడు కూడా మలం ఎరుపు రంగులో వస్తుంది. ఇటువంటి సందర్భాల్లో వైద్య సహాయం తీసుకోవడం చాలా అవసరం. అలాగే ఫైల్స్, మల ద్వారం వద్ద వచ్చే పగుళ్ల వల్ల కూడా మలం ఎరుపురంగులో వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా మనం విసర్జించే మలం రంగుపై మన శరీరం పూర్తి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మలాన్ని అసాధారణ రంగులో గుర్తించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించాల్సి ఉంటుంది. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.