Abortion Aftercare | అమ్మదనం దేవుడి వరం. తల్లి అవుతున్న మాట ఎంత సంతోషాన్నిస్తుందో.. గర్భస్రావం జరిగిన విషయం అంతకన్నా ఎక్కువ బాధలోకి మనల్ని నెట్టేస్తుంది. గర్భస్రావం అనేది ప్రస్తుత రోజుల్లో సర్వసాధారణమైపోయింది. గర్భస్రావం తర్వాత మహిళలు స్వతహాగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా ఉద్యోగాలు చేసే మహిళలు ఈ బాధ నుంచి బయటపడేందుకు చాలా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో అబార్షన్ తర్వాత ఎలాంటి పనులు చేయాలి..? ఎలాంటి కేర్ తీసుకోవాలి..? అనే విషయాలను తెల్సుకోవడం చాలా అవసరం.
గర్భస్రావం రకాలు..
సర్జికల్ : గర్భధారణ సమయంలో అభివృద్ధి చెందే పిండాన్ని శస్త్రచికిత్స ద్వారా గర్భం నుంచి తొలగించి వేయడం.
మెడికల్ : గర్భాన్ని ముగించేందుకు వివిధ మందులను వాడటం. సాధారణంగా అబార్షన్ పిల్ ఉపయోగిస్తారు.
అబార్షన్లు తక్కువ ప్రమాదకరమైన వైద్యవిధానాలుగా పరిగణిస్తారు. అయినప్పటికీ, తీవ్ర రక్తస్రావం, తిమ్మిర్లు వంటి దుష్ప్రభావాలు ఇబ్బంది పెడుతుంటాయి. అబార్షన్ చేయించుకున్న అనంతరం ఎలాంటి పనులు చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది వైద్యులు చెప్తుంటారు. వాటిని తప్పనిసరిగా అమలు చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అబార్షన్ తర్వాత ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి. ఎవరైనా ఫిట్‌గా ఉన్నట్లయితే మరుసటి రోజు నుంచే యధావిధిగా పనుల్లో చేరవచ్చు. అయితే, మొదట కొన్ని రోజులు నొప్పిని కలిగించే పనులకు దూరంగా ఉండాలి.
పోస్ట్ అబార్షన్ లక్షణాలు..
అబార్షన్ చేయించుకున్న వారిలో సాధారణంగా రక్తస్రావం జరగడం, తిమ్మిర్లు వస్తుంటాయి. సర్జికల్ విధానంలో నాలుగు వారాల వరకు రక్తస్రావం జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తి నుంచి వ్యక్తికి రక్తస్రావం ఫ్రీక్వెన్సీ మారుతుంది. మెడికల్ విధానంలో సాధారణం కంటే చాలా ఎక్కువ రక్తస్రావం జరుగుతుంది. కొన్నిసార్లు రక్తం గడ్డకడుతుంది. గడ్డకట్టిన రక్తం ఎరుపు నుంచి ముదురు ఊదారంగులో ఉంటుంది. చెడు వాసన వస్తుంది. ప్రతి 4 నుంచి 6 గంటలకు శానిటరీ ప్యాడ్ మార్చుకోవాల్సి వస్తుంది. లైంగిక చర్యల్లో పాల్గొన్నవారిలో మరింత ఎక్కువ రక్తస్రావం కనిపిస్తుంది. అందుకుని లైంగిక చర్యలకు దూరంగా ఉండాలి.
తిమ్మిర్లు సాధారణంగా 3-5 రోజులపాటు కనిపిస్తాయి. మెడికల్ అబార్షన్‌లో నొప్పి కూడా తీవ్రంగా ఉంటుంది. తిమ్మిర్లను తగ్గించుకునేందుకు వైద్యుల సూచనలతో మందులు వాడాలి. హీటింగ్ ప్యాడ్ లేదా వేడి నీటి బాటిల్‌ను ఉపయోగించి ఉపశమనం పొందవచ్చు. తిమ్మిర్లు ఎక్కువగా ఉంటే లోతైన శ్వాస తీసుకుంటూ మొల్లగా వదలడం చేయాలి. తుంటి, వీపు, పొట్ట భాగంలో నూనెతో మసాజ్ చేయించుకోవాలి. అలాగే, కొన్నిరోజుల పాటు అనారోగ్యంతో పాటు వాంతులు కూడా అవుతాయి.
ఇతర దుష్ప్రభావాలు..
ఛాతీ, రొమ్ముల భాగంలో నొప్పి కనిపిస్తుంది.
మ్యూకస్ మాదిరి డిశ్చార్జీ ఎక్కువగా ఉంటుంది.
వికారం, వాంతులు, అతిసారం జరుగుతుంది.
కొంత మందిలో చలి, వణుకు కనపడుతుంది.
నిద్రపోతున్న భావనలో ఉంటారు.
తక్కువ పనికే శక్తిని కోల్పోతుంటారు.
త్వరగా అలసిపోతుంటారు.
ఎప్పుడు వైద్యుడ్ని సంప్రదించాలి..
అధిక రక్తస్రావం జరుగుతున్న సందర్భాలు
రక్తం గడ్డలు నిమ్మకాయ కంటే పెద్దదిగా ఉన్నప్పుడు
రెండు వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగే గర్భధారణ సంకేతాలు
మూర్చ వచ్చిన సందర్భాలు
ఛాతీలో అసౌకర్యంగా కనిపించడం
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
ఇన్ఫెక్షణ్తో జ్వరం వచ్చినప్పుడు
చీము లాంటి డిశ్చార్జీ జరుగుతున్నప్పుడు
వెన్ను నొప్పి లేదా కడుపు నొప్పి కనిపించినప్పుడు వైద్యులను సంప్రదించి తగు చికిత్స పొందాలి.
గర్భస్రావం తర్వాత ఉద్యోగులు విధుల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా లేని వారు తమ హెచ్ఆర్ విభాగాల్లో మాట్లాడి సెలవు తీసుకోండి. కార్యాలయ వాతావరణాన్ని ఫేస్ చేసేందుకు సిద్ధంగా లేనప్పుడు వర్క్‌ఫ్రం హోం చేసేందుకు అనుమతి కోరండి. మీ సమస్యను స్నేహితులు, సహోద్యోగులు, కుటుంబసభ్యులతో పంచుకోవడం అలవర్చుకోవాలి. మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండేలా తయారవ్వాలి. ఆఫీసుకు వెళ్లాల్స వస్తే పనులతో బిజీగా ఉండేలా చూసుకోవాలి. విరామ సమయాన్ని ధ్యానం చేసేందుకు వినియోగించుకోవాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.