Breakfast | ఉరుకులు పరుగుల జీవనశైలి కారణంగా పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ మిస్సవుతున్నారా? ఇక నుంచి అలా చేయవద్దని చెబుతున్నారు పరిశోధకులు. ఎందుకంటే బ్రేక్‌ఫాస్ట్‌తో మనకు శక్తి వస్తుంది. ఆ సత్తువ అందకపోతే.. శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం తగ్గిపోతుంది. దాంతో గుండె రోగాలు మొదలుకుని క్యాన్సర్ వరకు ఎన్నో రుగ్మతల ముప్పు పొంచి ఉంటుంది. ఈ నిర్ధారణ వెనుక ఓ సమగ్ర అధ్యయనమూ ఉంది.
న్యూయార్క్‌లోని మౌంట్ సినాయ్ ఐకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన నిపుణుల బృందం బ్రేక్‌ఫాస్ట్‌పై సమగ్ర అధ్యయనం చేసింది. ఉదయపు తిండిని వాయిదా వేస్తే కనుక.. రోగ నిరోధక కణాల మీద ప్రతికూల ప్రభావం చూపేలా శరీర వ్యవస్థ మెదడును పురికొల్పుతుంది. నిజమే, ఉపవాసం ఆరోగ్యకరమే. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, దీర్ఘకాలం పాటు ఉపవాసాలు మాత్రం తీవ్రంగా చేటు చేస్తాయని పరిశోధకుల హెచ్చరిక. తమ అధ్యయనం కోసం ఎలుకలను రెండు వర్గాలుగా విభజించారు. వీటిలో ఒక వర్గం ఎలుకలు నిద్ర లేవగానే బ్రేక్‌ఫాస్ట్ తినేలా జాగ్రత్త తీసుకున్నారు. మరో వర్గానికేమో అలాంటి ఏర్పాటేదీ లేదు. ఆ తర్వాత మళ్లీ.. నిద్ర లేచిన సమయంలో, తర్వాత మరో నాలుగు గంటలకు, మళ్లీ మరో ఎనిమిది గంటలకు రెండు వర్గాల ఎలుకల రక్త నమూనాలను సేకరించారు. ఇందులో రెండు గ్రూపుల ఎలుకల రోగ నిరోధక శక్తిలో కీలకపాత్ర పోషించే తెల్లరక్త కణాలైన.. మోనోసైట్లలో తేడాలు ఉండటం వారు గమనించారు.
ఉపవాసం ఉంచిన ఎలుకల శరీరాల్లో నిద్ర లేచిన నాలుగు గంటల తర్వాత 90 శాతం మోనోసైట్లు రక్త ప్రవాహం నుంచి కనుమరుగై పోయాయి. ఎనిమిది గంటల అనంతరం ఆ సంఖ్య మరింత క్షీణించింది. అదే సమయంలో, నిద్ర లేవగానే ఆహారం పెట్టిన ఎలుకల మోనోసైట్ల మీద మాత్రం ఎలాంటి ప్రభావం పడలేదు. ఎలుకలను 24 గంటలపాటు ఉపవాసం ఉంచి, ఆ తర్వాత వాటికి ఆహారం ఇచ్చినప్పుడు మాత్రం మోనోసైట్లు కొన్ని గంటల్లోనే మళ్లీ రక్త ప్రవాహంలోకి చేరుకున్నాయి. అయితే, ఇవి ఇలా వేగంగా రక్తంలోకి చేరుకునే క్రమంలో శరీరంలో ఇన్ఫ్లమేషన్ స్థాయులను గణనీయంగా పెంచాయట. అలా మోనోసైట్లు తమ సహజ కర్తవ్యాన్ని నిర్వర్తించ కుండా.. ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని సంరక్షించుకోకుండా.. ఇన్ఫెక్షన్పై పోరాటానికి శరీరాన్ని తక్కువగా సన్నద్ధం చేశాయని కూడా ఈ పరిశోధనలో తేలింది. అర్థమైంది కదా.. బ్రేక్‌ఫాస్ట్ తీసుకోండి.