అల్సర్.. జీవితంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక దశలో ఎదురయ్యే సమస్య. నీళ్లు తక్కువగా తాగడం, మానసిక ఒత్తిడి తదితర కారణాల వల్ల అల్సర్లు వస్తుంటాయి. ఈ రకంగా వచ్చే అల్సర్లు.. మూడు నాలుగు రోజుల్లో తగ్గిపోతాయి. అలా కాకుండా ఎక్కువరోజులు ఉండి బాధిస్తుంటే.. అలాంటి అల్సర్లనుఅనుమానించాల్సిందే.
సాధారణ అల్సర్లు
నోటిపూత, పెప్టిక్ అల్సర్లు, గ్యాస్ట్రిక్ అల్సర్లు, అన్నవాహిక అల్సర్లు, మంచానికే పరిమితమైనప్పుడు ఏర్పడే పుండ్లు, సిఫిలిస్, హెర్పిస్ వంటి ఎస్టీడీ, మర్మావయవాలలో ఏర్పడే అల్సర్లు, డయాబెటిస్ వల్ల కాళ్లలో వచ్చే న్యూరోపతిక్ అల్సర్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి.
క్యాన్సర్‌కు దారితీసే అల్సర్లు
పెప్టిక్ అల్సర్లు : జీర్ణవ్యవస్థలో ఎక్కువగా కనిపించేవి పెప్టిక్ అల్సర్లు. చిన్నపేగు మొదట్లో ఉండే ఈ అల్సర్లను డియోడినల్ అల్సర్లు అనికూడా అంటారు. ఈ అల్సర్ క్యాన్సర్‌గా మారే అవకాశం 1శాతం ఉంటుంది.
గ్యాస్ట్రిక్ అల్సర్లు : జీర్ణాశయంలో వచ్చే అల్సర్లను గ్యాస్ట్రిక్ అల్సర్లు అంటారు. ఇవి క్యాన్సర్‌గా మారే అవకాశాలు ఎక్కువ. ‘హెలికోబ్యాక్టరీ పైలోరి’ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల గ్యాస్ట్రిక్ అల్సర్లు వస్తాయి.
స్టమక్ అల్సర్లు : దీర్ఘకాలంగా ఉన్న గ్యాస్ట్రిక్ అల్సర్లే స్టమక్ క్యాన్సర్లకు దారితీస్తాయి. ఇవి గ్యాస్ట్రిక్ అల్సర్ లక్షణాలను పోలి ఉంటాయి. అందుకని ఒకసారి అల్సర్ వచ్చి తగ్గిన తరువాత రెండోసారి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే వైద్యులను సంప్రదించి ఎండోస్కోపి, బయాప్సీ పరీక్షలు చేయాలి. సీటీ-స్కాన్, అల్ట్రాసౌండ్ ఎండోస్పోపి పరీక్షలు చేయించుకోవాలి.
అల్సర్లకు ప్రధాన కారణాలు
మసాలా ఆహారం, కారం, మానసిక ఒత్తిడి, మద్యపానం తదితర కారణాలే అల్సర్లకు కారణంగా భావించేవారు. అయితే, టారీమార్షల్, రాబిన్ వారెన్ అనే వైద్యులు ‘హెలికోబ్యాక్టర్ పైలోరి’ అనే బ్యాక్టీరియా వల్ల అల్సర్లు వస్తాయని కనుగొన్నారు. ప్రపంచంలో 90శాతం మంది ఈ బ్యాక్టీరియాకు గురికావడం సహజం. కానీ, ఒత్తిడి, ఎసిడిటీ, మద్యపానం, ధూమపానం వల్ల శరీరస్వభావం మేరకు రోగి జీర్ణవ్యవస్థ లైనింగ్ దెబ్బతింటుంది. ఆ సమయంలో ఈ బ్యాక్టీరియా అల్సర్‌కు దారితీస్తుంది.
గ్యాస్ట్రిక్ అల్సర్ల ప్రధాన లక్షణాలు
చికిత్సా పద్ధతులు
ఏ క్యాన్సర్‌కైనా ప్రారంభ దశలోనే చికిత్స తీసుకుంటే మంచిది. స్టమక్ క్యాన్సర్లు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ల చికిత్స క్యాన్సర్ కారకం ఉన్న ప్రదేశం, వ్యాధి దశపై ఆధారపడి ఉంటుంది. పొట్టలో క్యాన్సర్ కారకం ఉన్న ప్రదేశం ఆధారంగా ప్రభావిత భాగాన్ని తొలగించి, గ్యాస్ట్రెక్టమీ, లింఫ్నాడ్స్, చిన్నపేగులో కొంతభాగాన్ని తొలగిస్తారు. వ్యాధిని ఆలస్యంగా గుర్తించినప్పుడు పొట్ట మొత్తాన్నీ తీసివేసి, అన్నవాహికను చిన్నపేగుతో కలిపివేస్తారు. శస్త్రచికిత్స తరువాత ఆహారం సరిగ్గా తీసుకోలేకపోవడం, వాంతులు, విరేచనాలు, వికారం, మలబద్ధకం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శస్త్రచికిత్స తరువాత సప్లిమెంట్స్, విటమిన్-డి, క్యాల్షియం, ఐరన్, విటమిన్-బి 12 ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. రోగి తీసుకున్న ఆహారం నేరుగా చిన్నపేగుల్లోకి వెళ్తుంది కాబట్టి ఆహారాన్ని తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవాలి. ఆహారానికి ముందు, తరువాత ద్రవ పదార్థాలు తీసుకోవాలి.
చివరిదశలో…
క్యాన్సర్లను చివరిదశలో గుర్తించినప్పుడు లేజర్ థెరపీ, రేడియేషన్ థెరపీలను అనుసరిస్తారు. క్యాన్సర్ కణితి పరిమాణం తగ్గించి, పేగులలో స్టంట్ అమరుస్తారు. దీని ద్వారా ఆహారం జీర్ణవ్యవస్థలోకి వెళ్తుంది. కానీ, ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు క్యాన్సర్ మరింత ముదిరి ఇతర అవయవాలకు సైతం వ్యాపించే అవకాశం ఉంది.
జాగ్రత్తలు
సాధారణంగా కడుపులో మంట, ఉబ్బరం, పుల్లటి తేన్పులు, అజీర్తి వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పుడో ఒకసారి ఈ లక్షణాలు కనిపిస్తే సమస్య లేదు. కానీ తరచూ వెంటాడినప్పుడు కూడా చాలామంది యథేచ్ఛగా యాంటాసిడ్ వాడుతుంటారు. తోచిన చిట్కాలను పాటిస్తుంటారు. ఇలాంటి ప్రయోగాలు చాలా ప్రమాదకరం. అందుకని పై లక్షణాలు తరచూ కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందాలి.
– డాక్టర్ మోహనవంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్98490 22121