హైదరాబాద్: మహిళల్లో పాలిసిస్టైన్ ఓవరీ సిండ్రోమ్ (PCOS), పాలిసిస్టైన్ ఒవేరియన్ డిసీజ్ (PCOD) అనేవి ఈ రోజుల్లో సర్వసాధారణ సమస్యలుగా మారిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మంది మహిళల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ PCOS, PCOD సమస్యలకు కచ్చితమైన కారణమేందో తెలియదు కానీ, చాలామంది మహిళల్లో ఇన్సులిన్ నిరోధం కారణంగా సమస్య వస్తున్నట్లు తేలింది. ఇన్సులిన్ నిరోధంవల్ల హార్మోన్ల విడుదలలో అసమతుల్యత వస్తుందని వెల్లడైంది.
అంతేకాదు, ఇన్సులిన్ నిరోధంవల్ల హార్మోన్ల అసమతుల్యత సమస్యలు వచ్చిన వారి శరీరంలో చక్కెరల వినియోగం ఎక్కువగా జరుగదు. దాంతో వారిలో షుగర్ లెవల్స్ పెరిగిపోయే ప్రమాదం కూడా ఉన్నది. అయితే, ఈ PCOS, PCOD సమస్యలకు పోషకాహారం పూర్తిస్థాయి పరిష్కారం చూపకపోయినా.. అస్సలు పోషకాహారం తీసుకోని వారితో పోల్చితే పోషకాహారం తీసుకునే వారిలో సమస్యలు తగ్గుముఖం పడుతున్నట్లు ఓ పరిశోధనలో తేలింది. అంతేగాక పోషకాహారం తీసుకునే వారు బరువు కూడా బాగా తగ్గుతున్నట్లు స్పష్టమైంది.
PCOS, PCOD సమస్యలతో సతమతమవుతున్న మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత తగ్గడానికి కొన్ని రకాల గింజలు బాగా ఉపయోగపడుతాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మహిళల్లో చాలా సంక్లిష్టమైన సమస్య. ఇది వారి ఆరోగ్యంపై బాగా ప్రభావం చూపుతుంది. కాబట్టి మహిళలు తరచూ కొన్ని రకాల గింజలు తీసుకోవడంవల్ల హార్మోన్లు సమంగా విడుదలై సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మరి ఆ గింజలు ఏవో తెలుసుకుందామా..?
ఈ చియాగింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ అమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేగాక ఫైబర్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్, కాల్షియం కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇవి మనిషి శరీర బరువు తగ్గడానికి, రక్తంలో షుగర్ లెవల్స్ మెరుగుపడటానికి తోడ్పడుతాయి. గుండె జబ్బులతో బాధపడుతున్న వారిలో సమస్యను తగ్గించడానికి కూడా ఈ చియా గింజలు తోడ్పడుతాయి.
పొద్దుతిరుగుడు గింజల్లో సెలెనియం పుష్కలంగా ఉంటుంది. ఇది కాలేయ నిర్విషీకరణకు తోడ్పడి హార్మోన్ల సక్రమ విడుదలకు దోహదం చేస్తుంది. అంతేగాక ఫ్యాట్ కంటెంట్ కూడా పొద్దుతిరుగుడు చాలా ఎక్కువ. యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలుంటాయి. పైగా ఫైబర్లు, ప్రొటీన్లు కూడా ఈ పొద్దుతిరుగుడు గింజల్లో ఎక్కువగా ఉంటాయి.
ఈ గుమ్మడి గింజల్లో మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అందుకే గుమ్మడి గింజలను ఆహారంలో భాగం చేసుకోవడంవల్ల మోనోపాజ్ తర్వాత మహిళలు ఆస్టియోపోరోసిస్ బారినపడే రిస్క్ తగ్గుతుంది.
అవిసె గింజల్లో ఒమేగా-3 ALA, ఫైబర్ కావాల్సినంత ఉంటాయి. ఇవి హార్మోన్లను సమతాస్థితిలో ఉంచడానికి తోడ్పడుతాయి. PCOS, PCOD సమస్యలవల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌ను కూడా నిరోధిస్తాయి. అదేవిధంగా శరీరంలో ఈస్ట్రోజన్ ఉత్పత్తికి దోహదం చేస్తాయి. అంతేగాక సంతాన సాఫల్యతను కూడా పెంచుతాయి.
నువ్వు గింజల్లో కాల్షియం, జింక్, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. అదేవిధంగా ప్రొటీన్లు కూడా ఈ నువ్వు గింజల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్మోన్ల అసమానతలను క్రమబద్దీకరించడంలో బాగా ఉపయోగపడుతాయి.
ఈ జనుము గింజల్లో GLAగా పిలిచే ఒక రకమైన ఒమేగా-6 ఫ్యాట్ ఉంటుంది. హార్మోన్లను క్రమతాస్థితిలో ఉంచడానికి ఇవి తోడ్పడుతాయి. వీటిలో ఫైటో కాంపౌండ్స్ కూడా విరివిగా ఉంటాయి. ఇవి మహిళల్లో మోనోపాజ్ దశలో వచ్చే దుష్ప్రభావాలను నిరోధిస్తాయి.