న్యూఢిల్లీ : పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా భూమిలోపల వేర్ల నుంచి వచ్చే కూరగాయలతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రూట్ వెజిటబుల్స్గా పిలిచే ఈ కూరగాయలను నిత్యం తీసుకుంటే మెరుగైన ఆరోగ్యం సొంతమవుతుంది.
బీట్రూట్ : రక్త శుద్ధి, రక్త వృద్ధికి బీట్రూట్ అద్భుతంగా పనిచేస్తుంది. శరీరం చురుకుగా పనిచేసేందుకు కణాల వృద్ధికి బీట్రూట్ దోహదపడుతుంది. బీట్రూట్లో ఉండే పోలేట్తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. నిత్యం బీట్రూట్ను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
క్యారెట్ : మనం ఎంతో ఇష్టంగా తినే క్యారెట్ ఆరోగ్యానికి తిరుగులేని వెజిటబుల్‌గా చెబుతారు. క్యారెట్లలో ఉండే విటమిన్ ఏ, బీటా కెరోటోన్తో కంటి ఆరోగ్యం మెరుగవుతుంది. క్యారెట్‌ను రోజూ తీసుకుంటే కంటి సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు.
ఉల్లి : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని చెబుతుంటారు. అన్ని కూరలు, వంటకాల్లో ఉల్లిని వాడుతుంటారు. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగిన ఉల్లితో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్నది నిపుణుల మాట.
అల్లం : పలు వంటకాల నుంచి టీ వరకూ అన్నింటా అల్లం అదనపు రుచిని తీసుకువస్తుంది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న అల్లంతో గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగవుతుంది. అల్లాన్ని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా పలు అనారోగ్య సమస్యల నుంచి దూరం కావచ్చు.
చేమదుంప : రూట్ వెజిటబుల్స్‌లో పేరొందిన చేమదుంపలో ఫైబర్ అధికంగా ఉండటంతో జీర్ణక్రియ సాఫీగా సాగేందుకు సాయపడుతుంది. పైగా ఇందులో ఉండే విటమిన్ సీతో మెరుగైన రోగనిరోధక శక్తి సొంతమవుతుంది.