ఆల్ బుఖారా పండ్లు ఎక్కువగా వర్షాకాలంలో కనిపిస్తాయి. ఎరుపు-నీలం మిక్స్డ్ కలర్లో నిగనిగలాడుతుంటాయి. ఇవి రుచికి తియ్యగా, కాస్త వగరుగా ఉంటాయి. వీటిని ప్రధానంగా పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లో పండిస్తారు. ఈ రుచికరమైన పండులో పొటాషియం అధికంగా ఉంటుంది. మన శరీరానికి కావాల్సిన పోషకాలుంటాయి. అలాగే, ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.
ఇది కణాలకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. ఆల్ బుఖారాలో విటమిన్ సీ కూడా ఉంటుంది, ఇది ఆరోగ్యకరమైన రక్తనాళాల అభివృద్ధికి తోడ్పడుతుంది, వాపును తగ్గిస్తుంది. కళ్లకు మేలు చేస్తుంది. ఇంకా ఈ ఆల్ బుఖారాలతో ముఖ్యమైన ఐదు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు తెలిపారు.
1.జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది..
ఆల్ బుఖార పండు అడ్రినల్ గ్రంథి లోపాన్ని నివారిస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని ఆపుతుంది. అధిక ఐరన్ కంటెంట్, మెరుగైన రక్త ప్రసరణ కారణంగా, ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మీకు ఒత్తుగా ఉండే జుట్టు కావాలంటే ప్రతిరోజూ ఆల్బుఖారాను తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
2. మలబద్ధకాన్ని నివారిస్తుంది..
ఆల్ బుఖారా పండ్ల నుంచి తయారు చేసిన ప్రూన్స్లో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం పొందే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఆల్ బుఖారాలో ఉండే ఇసాటిన్, సార్బిటాల్ జీర్ణక్రియకు సహాయపడుతాయి. మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. అదనంగా, ఇది పేగు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
3.క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది..
ఆల్ బుఖారాలకు ఎర్రని రంగునిచ్చే వర్ణద్రవ్యం ఆంథోసైనిన్స్ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. ఫలితంగా నోటి, కుహరం, రొమ్ము క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పిస్తుంది.
4. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది..
ఆల్ బుఖారాలో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్స్, వాటి యాంజియోలైటిక్ లక్షణాల కారణంగా ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి. ఒత్తిడికి గురైనప్పుడు లేదా ఆత్రుతగా అనిపించినప్పుడల్లా ఆల్ బుఖారా పండ్లను తింటే మంచి ఫలితం ఉంటుంది.
5. జీవక్రియను మెరుగుపరుస్తుంది..
ఆల్ బుఖారా పండ్లు జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల జీర్ణశక్తి సాఫీగా ఉంటుంది. శరీర మలినాలు, అధిక బరువు తగ్గేందుకు ఆల్ బుఖారాలు ఉపయోగపడుతాయి.