యోగాలోని కొన్ని ప్రత్యేక ఆసనాలు సత్వర ఫలితాన్ని ఇస్తాయి. వాటిలో ఒకటి సుప్త బద్ధకోణాసనం. ఈ ఆసనాన్ని సులభంగా వేయవచ్చు. కాస్త ప్రయాస పడితే గర్భిణులు సైతం సాధన చేయవచ్చు.
ఈ సాధన వల్ల కాన్పు తేలికగా అవుతుందంటే.. కాబోయే అమ్మ ప్రయత్నించకుండా ఉంటుందా? ఇంతకీ సుప్త బద్ధకోణాసనం ఎలా వేయాలంటే..
ముందుగా చాపమీద వెల్లకిలా పడుకోవాలి. ఇబ్బందిగా ఉన్నవాళ్లు వీపు కింద దిండు, మెత్తటి దుప్పటి కూడా పెట్టుకోవచ్చు.ఇప్పుడు, చిత్రంలో చూపిన విధంగా రెండు కాళ్లనూ పైకి మడవాలి. రెండు పాదాలు ఒక దానిని ఒకటి పూర్తిగా ఆనుకుని ఉండేలా జాగ్రత్తపడాలి. అలా అని శరీరం మీద ఒత్తిడి వేయకూడదు.
మోకాళ్లు నేలకు తాకేలా చూసుకోవాలి.
ఇప్పుడు, రెండు చేతులను నిదానంగా తలపైకి తీసుకోవాలి.
ఈ ఆసనంలో 30 నుంచి 60 సెకండ్లు ఉండాలి. శ్వాస నిదానంగా తీసుకోవాలి.
తర్వాత, రెండు చేతులను నిదానంగా కిందికి తీసుకోవాలి. తర్వాత పాదాలను ముందుకు చాపి దండాసన స్థితిలోకి రావాలి. తర్వాత జాగ్రత్తగా పైకి లేవాలి.
మోకాళ్లు పూర్తిగా నేలకు ఆనించలేనివాళ్లు బ్లాక్స్‌ని వాడవచ్చు.
ప్రయోజనాలు
కాన్పు తేలిగ్గా అయ్యేలా సాయపడుతుంది.
జననేంద్రియాల దగ్గర మంటను తగ్గిస్తుంది.
మూత్రాశయ సమస్యలను నివారిస్తుంది.
చేయకూడనివారు
కండ్లు తిరుగుతున్న వాళ్లు ఈ ఆసనం వేయకూడదు. వ్జైనా నుంచి రక్తస్రావం అవుతున్నా, వాంతులు అవుతున్న ఫీలింగ్ ఉన్నా ప్రయత్నించొద్దు. డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే ఆసనం వేయాలి.
అనితా అత్యాల
ప్రెగ్నెన్సీ యోగా నిపుణురాలు
6309800109