మా అమ్మాయికి 14 ఏండ్లు. ఐదు నెలల క్రితమే పెద్ద మనిషి అయ్యింది. తనకు విపరీతమైన నెలసరి నొప్పి. పొత్తి కడుపులో భరించలేనంత బాధ. బాగా ఏడుస్తుంది. నాకు మొదటి నుంచీ నెలసరిలో నడుము నొప్పి ఉండేది కానీ, కడుపు నొప్పి రాలేదు. మందులు వాడితే నొప్పి తీవ్రత తగ్గే అవకాశం ఉందా? – ఓ తల్లి
జ: నెలసరి సమయంలో, రెండు రకాల ఇబ్బందుల వల్ల పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. ‘ప్రైమరీ డిస్మెనోరియా’ వల్ల నొప్పి వస్తుంటే, ఆ తీవ్రతను తగ్గించేందుకు ఒకటే మార్గం. బాగా నీళ్లు తాగాలి, వేళకు నిద్రపోవాలి, బెడ్ రెస్ట్ తీసుకోవాలి. నొప్పిని తగ్గించే మందులూ వాడొచ్చు. ప్రైమరీ డిస్మెనోరియా రెండు రోజులు ఉండి, దానంతట అదే తగ్గిపోతుంది. అధికశాతం మహిళల్లో ఇలాంటి పరిస్థితినే చూస్తుంటాం. ‘సెకండరీ డిస్మెనోరియా’ అలా కాదు. గర్భ సంచిలో ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్, అడినోమయాసిస్, లూప్ ఇండ్యూస్డ్ డిస్మెనోరియా, పీఐడీ వంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ ఇబ్బంది ఎదురవుతుంది. ఇలాంటప్పుడు నొప్పిని తగ్గించే మందులపై ఆధారపడకుండా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. ఉదాహరణకు గర్భసంచిలో గడ్డలు, పాలిప్స్ ఉన్నప్పుడు.. వాటిని తొలగిస్తేనే సమస్య పూర్తిగా తగ్గుతుంది. నెల
సరిలో నొప్పి ఎన్ని రోజులు ఉంటున్నది, ఆ తీవ్రత ఎంత అన్నదాన్నిబట్టి వైద్యులను సంప్రదించడం మంచిది.
డా. కావ్యప్రియ వజ్రాల
కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్.
యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ