Kaleshwaram Project
శ్రీరాంసాగర్ వరద కాలువ సజీవ ధారగా ఉండాలన్న కేసీఆర్ జల ఆశయం నెరవేరుతున్నది. తెలంగాణ జలసిరుల గని కాళేశ్వరం..
తన ఇంజినీరింగ్ ఫలాలను, ఫలితాలను అందిస్తున్నది. పునరుజ్జీవ పథకం సరికొత్త చరిత్రను లిఖిస్తున్న సందర్భమిది.
వరదకాలువలోకి ఎదురెక్కుతూ వచ్చిన కాళేశ్వరం జలాలు లక్ష్యాన్ని ముద్దాడుతున్న అపురూప క్షణాలివి.
గురువారం సాయంత్రం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చెంతన వరదకాలువ జీరోపాయింట్‌ను చేరుకొన్నాయి. దిగువకు పారే నీటినే చూసిన రైతులు.. ఎదురెక్కి వస్తున్న జల కాళేశ్వరుడిని చూసి కైమోడ్పులు అర్పించారు.
‘కాళేశ్వరం విలువ కష్టకాలంలోనే తెలుస్తుంది’ అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు అక్షరసత్యాలు. చినుకు జాడ లేక ఆగమవుతున్న అన్నదాతకు..
కదిలివస్తున్న కాళేశ్వర జలాలు కల్పతరువుగా మారనున్నాయి. తెలంగాణకు నీటి భరోసానిస్తున్నాయి. నేడు రివర్స్ పంపింగ్‌తో వరదకాలువ నుంచి కాళేశ్వర జలాలు శ్రీరామసాగరంలోకి చేరనున్నాయి.
కాలమేదైనా.. కలిసి రాకున్నా సాగుకు ఢోకా లేని పరిస్థితికి జలదృశ్యం కాళేశ్వరం ప్రాజెక్టు. అందుకు సంబంధించి అద్భుత దృశ్యం నేడు ఆవిష్కృతం కానున్నది.
సముద్ర గర్భంలోకి వృథాగా పోతున్న నదీ జలాలను మళ్లించి నీటికి సరికొత్త నడకను నేర్పిన సీఎం కేసీఆర్ రైతులకు ఎల్లకాలం సాగునీటి గోస లేకుండా చేసిన తీరు నేడు దృశ్యరూపం దాల్చనున్నది.
తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయాల్లో పునరుజ్జీవపథకం ద్వారా ఎస్సారెస్పీని నింపే అద్భుతఘట్టం నేటి నుంచి పురుడుపోసుకోనున్నది.
ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం కార్యరూపం దాల్చనున్నది. వరదకాలువ ద్వారా తరలివచ్చిన కాళేశ్వర జలాలను నేడు ఎస్సారెస్పీలోకి ఎత్తిపోయనున్నారు. ఇందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
సీఎం కేసీఆర్ మార్గదర్శకాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతలు యథావిధిగా కొనసాగుతున్నాయి.
రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఇరిగేషన్ అధికారులు లక్ష్మీ పంప్‌హౌస్ నుంచి గాయత్రి వరకు జలాలను నిరంతరాయంగా తరలిస్తున్నారు.
లక్ష్మీ పంప్‌హౌస్ నుంచి సరస్వతి, పార్వతి పంపహౌస్ బరాజ్‌లకు అక్కడి నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు తరలిస్తున్నారు.
అక్కడి నుంచి టన్నెల్స్ ద్వారా నంది మేడారం, గాయత్రి పంప్‌హౌస్‌లకు అక్కడి నుంచి వరదకాలువలోకి జలాలను వదులుతున్నారు.
వరద కాలువ మొత్తం సామర్థ్యం 1.5 టీఎంసీలు కాగా, ఎప్పుడంటే అప్పుడు ఇటు ఎస్సారెస్పీకి, అటు రాజరాజేశ్వర జలాశయానికి కాళేశ్వర జలాలను తరలించేవిధంగా ప్రస్తుతం వరద కాలువను సిద్ధం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రాణహితలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతున్నది. బుధవారం సాయంత్రం నాటికి 23,200 వేల క్యూసెక్కుల వరద లక్ష్మీబరాజ్‌కు చేరుతుండగా, నీటినిల్వ సామర్థ్యం 7.5 నుంచి 9 టీఎంసీలకు చేరుకొన్నది.
గాయత్రి పంప్‌హౌస్ నుంచి తరలివస్తున్న జలాలు ఎస్సారెస్పీ వైపు పరుగులు తీస్తున్నాయి.
122 కిలోమీటర్ల మేర ఉన్న వరద కాలువలో 73వ మైలురాయి వద్ద నిర్మించిన రాంపూర్ పంప్‌హౌస్ నుంచి నాలుగు మోటర్ల ద్వారా మొత్తం 5,800 క్యూసెక్కుల జలాలు ఉప్పొంగుతూ బుధవారం రాత్రికే మెట్‌పల్లి మండలం రాజేశ్వర్‌రావుపేట (వరదకాలువ 34వ కిలోమీటరు) వద్ద నిర్మించిన పంపుహౌస్‌కు చేరుకొన్నాయి.
గురువారం ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్యలో మూడు మోటర్లు ఆన్ చేసి మొత్తం 4,350 క్యూసెక్కుల నీటిని నిజామాబాద్ జిల్లాలోని ముప్కాల్ పంప్‌హౌస్‌కు తరలింపు ప్రక్రియ చేపట్టగా, కాళేశ్వరం జలాలు బిరబిరమంటూ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చెంతకు గురువారం సాయంత్రానికి చేరుకొన్నాయి.
శుక్రవారం ఇక్కడి నుంచి కాళేశ్వరజలాలను ఎస్సారెస్పీలోకి ఎత్తిపోయనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు జగిత్యాల చీఫ్ ఇంజినీర్ సుధాకర్‌రెడ్డి వెల్లడించారు.
వర్షాలతో సంబంధం లేకుండా శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నింపే ప్రయత్నం చేయడం ఎస్సారెస్పీ చరిత్రలోనే ఇది సరికొత్త అధ్యాయం. స్వరాష్ట్రంలో ఇంతటి ఘనతకు సీఎం కేసీఆర్ పరిపాలనతోనే సాధ్యమైంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే బోసిపోయే పోచంపాడ్‌కు కాళేశ్వరం ప్రాజెక్టు రూపంలో వెన్నుదన్ను దొరకగా.. అదిప్పుడు నిజమైంది.
నీటిమట్టం గణనీయంగా పడిపోయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో మైదానంలా మారిన చోట గురువారం క్రికెట్ ఆడుతున్న యువకులు
ఎదురెక్కిన కాళేశ్వరం జలాలతో నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం దొన్కల్ వద్ద నిండుగా ప్రవహిస్తున్న శ్రీరాంసాగర్ వరద కాలువ
నిజామాబాద్ జిల్లా బాల్కొండ వద్ద ఎస్సారెస్పీ వరద కాలువలోకి ఎదురెక్కి వస్తున్న కాళేశ్వర జలాలకు పూజలు నిర్వహిస్తున్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం దొన్కల్ వరద కాలువ వద్ద కాళేశ్వర జలాలు ప్రవహిస్తుండగా గురువారం ఆవిష్కతమైన చూడచక్కని దృశ్యం
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం దొన్కల్‌లో వరద కాలువ వద్ద రైతులతో కలిసి విజయచిహ్నం చూపుతున్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
గురువారం గాయత్రి పంప్‌హౌస్ వద్ద ఉప్పొంగుతున్న కాళేశ్వర జలాలు
వరద కాలువ వద్ద సెల్ఫీ దిగుతున్న రైతులు